21-07-2025 12:54:57 AM
- ఆర్టీసీ బస్సుల్లో 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణాలు
- అందుకు తగ్గట్లుగా అందుబాటులో లేని బస్సులు, సిబ్బంది
- ఉచిత ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు
- సీట్ల కోసం కుస్తీలు పడుతున్న వైనం
- 52శాతం మహిళలు తీవ్ర అసౌకర్యంగా ప్రయాణిస్తున్నారంటున్న సర్వేలు
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం అందించిన ఘనత కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అయితే ఉచితం మాటున ఆడబిడ్డలు గౌరవం లేకుండా ప్రయాణం చేయా ల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో గొప్పగా ప్రారంభించిన ఈ పథకం తర్వాత ప్రయాణికులు మూ డు రెట్లు పెరిగారు.
అదే సమయంలో సిబ్బం ది నియామకాలు ఆగిపోయాయి. రిటైర్డ్ అ యిన వారిలో స్థానంలో కొత్తవారిని తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. డొక్కు బస్సులను నడిపేందుకు కార్మికుల కష్టాలు పడుతు న్నారు. ఒకప్పుడు సీటింగ్ కెపాసిటీ కూడా లేకుండా నడిచే బస్సులు ఇప్పుడు మూడు రెట్లు పెరిగిన ప్రయాణికులతో కిటకిటలాడు తూ నడుస్తున్నాయి. మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం, యాజమాన్యం తమ విజయంగా పేర్కొంటుంటే కార్మికులు మాత్రం డొక్కుబస్సులతో తాము సహజీవనం చేస్తున్నామని అంటున్నారు.
మరోవైపు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేస్తున్న మహిళలైనా సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఈ పథకం తమకు ఎంతో మంచిపేరు తెచ్చిపెడుతుందని భావించిన ప్రభుత్వం..ఈ పథకం ప్రవేశపెట్టడం వరకే తమ పని అన్నట్లుగా వ్యవహరించడం వల్లే యాజమాన్యం ఇష్టానుసారంగా ప్రవర్తించి సంస్థను ఈ స్థితికి తీసుకువచ్చిందని కార్మికులు అంటున్నారు. దాదాపు 52శా తం మహిళలు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణాలపై సర్వే చేసిన ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ తేల్చింది.
భారీగా పెరిగిన ప్రయాణికులు..
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసిన మొ దటి ఫైలే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం. చెప్పినట్లే ఈ హామీని ప్రభుత్వం నెరవేర్చింది. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది.
సాధారణ ప్రయాణికులతో పోలిస్తే ఉచిత ప్రయాణికుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మహిళల శాతం 65శాతంగా ఉంది. ఇక ప్రభుత్వ పెద్దలు ప్రతీసారి ఘనంగా తమ ఘనతను చెప్పుకుంటున్నారు. ఆర్టీసీలో 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేశారని..ఇందుకుగాను ప్రభు త్వం రూ.6,500కోట్లు ఆర్టీసీకి చెల్లించిందని, ఫలితంగా ఆర్టీసీ లాభాల్లో ఉందని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల పేర్కొన్నారు.
అంటే మహిళల ఉచిత బస్సు ప్రయాణాల విలువ నెలకు రూ.325కోట్లు. నెలనెలా రూ.325 కోట్లు చెల్లిస్తుంటే ఆర్టీసీకి ఈ దుస్థితి ఎందుకు.. ఎందుకు నియామకా లు ఆపేశారు.. ఎందుకు కొత్త బస్సులు తీసుకురారు..ఎందుకు మహిళలు ప్రయాణించే ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు పెంచరు.. అంటూ ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
బస్సులు, సిబ్బంది పెరగడం లేదు..
అర్టీసీలో ఏటా పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ కొత్తగా నియామకాలు లేవు. అలాగే అడపాదడపా కొత్త బస్సులను తీసుకువస్తున్నా.. కాలం చెల్లిన బస్సుల తొలగింపు సైతం కొనసాగుతోంది. ఫలితంగా బస్సుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. జూన్ 2024 నాటికి ఆర్టీసీలో 40,415 మంది సిబ్బంది ఉండగా.. 9,149 బస్సులున్నాయి.
అయితే తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీకి 10,450 బస్సులుండేవి. 57,254 మంది కార్మికులుండేవారు. ఇప్పుడు బస్సులు, కార్మికులు తగ్గిపోయారు. మరోవైపు గతంలో అద్దె బస్సులు 1,431 మాత్రమే ఉంటే ఇప్పుడవి 2,750కి చేరుకున్నాయి. అయితే మహిళలు ఉచితంగా ప్రయాణించే బస్సుల్లో జిల్లాల్లో పల్లెవెలుగు బస్సులు 3వేలకు పైగా, ఎక్స్‌ప్రెస్ బస్సులు 1,600 వరకు మాత్రమే ఉన్నాయి.
ఇక నగరంలో మహిళలకు ఉచిత సేవలు అందించే మెట్రో ఎక్స్‌ప్రెస్ 300, ఆర్డినరీ 855, సిటీ సబర్బన్ ఆర్డినరీ 557 బస్సులు అంటే దాదాపు 2వేల లోపు బస్సులు మాత్రమే నగర పరిధిలో ఉన్నాయి. అంటే సుమారు 6,500 బస్సులు మాత్రమే ఉచిత సేవలు అందిస్తాయి. వీటిలో చాలా బస్సుల కండిషన్ ఘోరంగా ఉంటుంది.
కొన్ని బస్సులు షెడ్లకే పరిమితమవుతాయి. ప్రభుత్వం చెప్తున్న ప్రయాణికుల లెక్కలు, వాస్తవంగా ఉన్న బస్సులు చూస్తే వారికి సేవలు ఎలా అందిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే తీసుకుంటే 20 నెలలకు 200కోట్ల మంది అంటే నెలకు సుమారు 10 కోట్ల మంది..రోజుకు 33.33లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లు.
అనధికారికంగా అందిన లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 43 లక్షల మంది వరకు ఆర్టీసీలో ప్రయాణాలు చేస్తున్నారు. క్రమంగా బస్సుల్లో ప్రయాణించే పురుషుల శాతం తగ్గిపోతోంది. మరోవైపు నవంబర్ 2023లో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే వారి సంఖ్య 18 లక్షలు మాత్రమే. అంటే ప్రయాణికుల సంఖ్య ఏమేరకు పెరిగిందో అర్థమవుతుంది. కానీ అందుకు తగ్గట్లుగా బస్సుల సంఖ్య పెంచలేదు.
క్యూఆర్ కోడ్ ఫిర్యాదు వ్యవస్థ ఉండాలి..
ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాలపై ఇటీవల ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఉచిత బస్సు సేవలు పొందుతున్న మహిళల్లో సగానికి పైగా అసౌకర్యంగా ప్రయాణిస్తున్నట్లు తేలింది. రద్దీకి తగ్గట్లుగా బస్సులు లేకపోవడం, సీట్ల కోసం సిగపట్లు, గొడవలు, దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్తోందని సర్వేలో మహిళలు తెలిపారు.
ఇక ఆర్టీసీ సిబ్బందికి కూడా జెండర్ సెన్సివిటీపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని సర్వే తేల్చింది. మహిళలు ప్రయాణాల్లో బస్సుల్లో, బస్ స్టేషన్లలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థ ఉండాలని, బస్టాండుల్లో మెరుగైన లైటింగ్, మహిళలకు భద్రతతో కూడిన తగినన్ని టాయిలెట్లు, పీక్ అవర్స్‌లో అదనపు బస్సుల ఏర్పాటు తదితర సలహాలను ఈ థేమ్స్ బిజినెస్ స్కూల్ సర్వే తెలిపింది.
ఇక పోలీసులతో కలిసి పనిచేస్తూ మహిళలకు భద్రత కల్పించే సిబ్బందిని నియమించాలని సూచించింది. మహిళలకు గౌరవంతో కూడిన ప్రయాణం హక్కు అని అని వారికి దక్కేలా చూడాలని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే రిపోర్టును ప్రభుత్వానికి కూడా అందించారు. అయితే అందుకు తగ్గట్లుగా మార్పులు వస్తాయా..లేదా అనేది ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చేతుల్లో ఉంది.
ఉచిత బస్సు..అన్నీ సమస్యలే..
డొక్కు బస్సులతో ప్రయాణాలు చేయడం కష్టంగా మారుతోంది. చాలా చోట్ల నడిరోడ్డుపైనే బస్సులు ఆగిపోతున్నాయి. 44 మంది ప్రయాణికుల పూర్తి సామర్థ్యానికి గాను 120నుంచి 140 మంది వరకు బస్సుల్లో ఎక్కుతున్నారు. కాదు కూడదు అంటే డ్రైవర్లు, కండక్టర్లను దూషించడం, దాడులు చేయడం వరకు పరిస్థితి వస్తోంది.
ఇక బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లు పడుతున్నారు. దాడులు చేసుకుంటున్నారు. తాము డబ్బులు చెల్లించి ప్రయాణిస్తుంటే ఫ్రీగా బస్సెక్కి సీట్లో కూర్చుని ప్రయాణిస్తారా అంటూ కొన్నిచోట్ల పురుషులు మహిళలను దూషిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కొందరు కండక్టర్లు సైతం మహిళలను చిన్నచూపు చూస్తున్న సందర్భాలున్నాయి. ఫ్రీ టికెట్ వల్ల సంస్థ పరిస్థితి ఇలా అయ్యిందన్న ఆవేదన వారిలో ఇలాంటి చర్యకు దిగేందుకు కారణంగా భావించవచ్చు.