20-07-2025 04:44:48 PM
విద్యాశాఖ చర్యలకు డిమాండ్..
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ కళాశాల(Alphores Educational Institutions) ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం కూడా తరగతులు నిర్వహిస్తుండటంపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు కళాశాలకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి తరగతులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ, నిర్మల్ జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదివారాలు కూడా తరగతులు నిర్వహిస్తున్నా, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
విద్యార్థులపై అనవసరమైన భారం మోపుతూ, వారి వ్యక్తిగత సమయాన్ని హరిస్తున్న ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదని వారు అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి మానసిక ఆరోగ్యం దృష్ట్యా నిబంధనల ఉల్లంఘనను అడ్డుకోవాలని వారు కోరారు. విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్ నగర కార్యదర్శి సాయి ఆదిత్య అభి అఖిలేష్ లక్ష్మీ ప్రసాద్ ఆదిత్య జగదీష్ నవదీప్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.