19-07-2025 06:55:49 PM
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(District Collector Viziendira Boyi) ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఏరియా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (1), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (1) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుకున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల సేవల నాణ్యతపై ఆధారపడి నియామక కాలాన్ని పొడిగించవచ్చని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టు కొరకు అనస్థీషియా/జనరల్ సర్జన్/ఫారెన్సిక్ మెడిసిన్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ పోస్టులో ఎంపిక అయిన వారికి రూ. ఒక లక్ష వేతనం ఉంటుందన్నారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (1) పోస్ట్ కు ఎంబిబిఎస్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జీతం రూ 52,351 చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు. 01.07.2025 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 46 సంవత్సరాలు కలిగి ఉండాలని,ఎస్సీ, ఎస్టి, బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు - 3 సంవత్సరాలు (సైన్యంలో చేసిన సేవ కాలానికి అదనంగా) దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుందని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం స్వయంగా, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సూపరింటెండెంట్, జిల్లా హెడ్ క్వార్టర్, ఏరియా ఆసుపత్రి, జడ్చర్లకు జూలై 28 లోపు పంపాలని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయని, మరిన్ని వివరాలకు జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ ను సంప్రదించాలని తెలియజేశారు.