19-07-2025 10:37:24 PM
ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆవేదన..
అదిలాబాద్ (విజయక్రాంతి): నా వెడ్మ ఫౌండేషన్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) ఆవేదన వ్యక్తం చేశారు. కిందిస్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన ఓ ఆదివాసి బిడ్డ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇటీవల ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని పలువురిని మోసం చేసిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థతో తన వెడ్మ ఫౌండేషన్ కు సంబంధాలు ఉన్నాయని కావాలని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మైక్రో ఫైనాన్స్ నిర్వాహకునికి తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆయన తన క్లాస్మెట్ మాత్రమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన రాజకీయ ఎదుగుదల చూడకనే కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉట్నూర్ లోని ఒకే భవనంలో తన వెడ్మ ఫౌండేషన్, మైక్రో ఫైనాన్స్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి తప్ప వారికి మకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా తనను ఎదురుకోలేకనే తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై, తన ఫౌండేషన్ పై దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితుల పక్షాన నిలబడి వారిని న్యాయం జరిగేలా చూస్తా హామీ ఇచ్చారు.