calender_icon.png 21 July, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు రాజ్యాధికారం గురించి ఆలోచించాలి

20-07-2025 10:12:27 PM

పరికిపండ్ల నరహరి ఐఎఎస్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): అధికారం వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం వస్తుందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య, సాంకేతిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఎఎస్ అధికారి పరికిపండ్ల నరహరి చెప్పారు. ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ సౌజన్యంతో జన అధికార సమితి ఆధ్వర్యంలో హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో ఓబీసీల పోరుబాట పుస్తక సమీక్ష సదస్సు ఆదివారం జరిగింది.

ఈ కార్యక్రమానికి వ్యాక్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వన్నాల వెంకట రమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పరికిపండ్ల నరహరి, విశిష్ట అతిథిగా మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ద్యాస్యం వినయ్ భాస్కర్, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, గోట్స్, షీప్స్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొరండ్ల కిషన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు, ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్, ఇంటిలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ఓబీసీల పోరుబాట పుస్తక రచయిత, మధ్య ప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ బీసీలు ముందు సామాజిక న్యాయం గురించి ఆలోచించవద్దని, అధికారం గురించి మాత్రమే ఆలోచించాలని కోరారు.

తెలంగాణలో బీసీలు సామాజిక న్యాయం గురించి ఆలోచించడం మూలంగానే అధికార దక్కించుకోలేక పోతున్నామని పరికిపండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలలో ప్రధానంగా ఐదు కులాలు అధిక సంఖ్య జనాభా కలిగి ఉన్నారని, ఈ ఐదు కులాలలో ఏ రెండు కులాలు ఏక తాటిపైకి వచ్చినా అధికారంలోకి చేచిక్కించు కోవడం ఖాయం అని పరికిపండ్ల అభిప్రాయపడ్డారు. ముందు ముఖ్యమంత్రి స్థానాన్ని బీసీలు కైవసం చేసుకున్న తర్వాత సామాజిక న్యాయం దానంతట అదే వస్తుందని, ఈ దిశగా బీసీలు ఆలోచించాలని పరికిపండ్ల నరహరి పిలుపు నిచ్చారు. కులాలను ప్రస్తుతం ప్రక్కన పెట్టి బీసీలంతా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పరికిపండ్ల ఉద్ఘాటించారు. బీసీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేవని బెంగటీలవద్దని, ముందు వనరులను సృష్టించుకొని యుద్దానికి సిద్దం కావాలని పరిపండ్ల నరహరి ధైర్యాన్ని నూరి పోశారు.

ప్రస్తుతం మనల్ని ఏలుతున్న సామాజిక వర్గాలు కేవలం రెండు అగ్ర కులాల కలయికతో మాత్రమే రాజ్యాధికారం సాధిస్తున్నారని పరికిపండ్ల వివరించారు. ఇక బీసీలు అంతా ఒక తాటిపైకి వస్తే దాని పరిణామం ఏ విధంగా ఉంటుందో ఉహించాలని సూచించారు. బీసీలలో ఎన్నికల్లో పోటీ చేయాలని కసి ఉండాలని, దానికి తోడు ధైర్యం ఉంటే మనం అనుకున్న లక్షాలను అవలీలగా సాధించగలమని పరికిపండ్ల హితవు పలికారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల సాధించడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని పరికిపండ్ల నరహరి స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలు రిజర్వేషన్లు సాధించాలంటే ఆంక్షలు అధిగమించాలని అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు గౌరవ సలహాదారులు వేముల సదానందం నేత స్వాగతోపన్యాసం చేయగా బీసీల పోరుబాట పుస్తక సమీక్ష ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ చేశారు. 

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెళ్ళి శ్రీరాములు, జన అధికార సమితి అధ్యక్ష కార్యదర్శులు చేరాల నారాయణ, కృష్ణమూర్తి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పద్మజా దేవి, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, సీనియర్ జర్నలిస్టు, వర్తమాన రచయిత గడ్డం కేశవమూర్తి, సీనియర్ జర్నలిస్టు వల్లాల వెంకట రమణ, పెరుక సంఘం రాష్ట్ర నాయకులు అల్లం నాగరాజు, గోప రాష్ట్ర నాయకులు నాగపురి రాజమౌళి, మున్నూరు సంఘం రాష్ట్ర నాయకులు మంద అయిలయ్య, హన్మకొండ, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలుస సుధీర్ కుమార్, పద్మశాలి అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి గణేష్, ట్రస్ట్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి దాసరి ప్రేమ్ సాగర్, మాజీ కార్పొరేటర్ కుసుమ సతీశ్ కుమార్, ప్రొఫెసర్ వంగరి సూర్యనారాయణ, డాక్టర్ భేతి కవిత, పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడెపు రవిందర్, పరకాల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేముల సదారాణి, పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ వడ్నాల నరేందర్, కోశాధికారి గజ్జెళ్ళి రవిందర్ తదితరులు పాల్గొన్నారు.