20-07-2025 09:26:31 PM
పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆషాడ మాసం పురస్కరించుకొని ఆదివారం ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మలకు మున్నూరు కాపు సంఘం సభ్యులు బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో వేప కొమ్మలు, కుంకుమ, పసుపు, పూలు, నైవేద్యంతో బోనాలను అందంగా అలంకరించి మహిళలు నెత్తిన పెట్టుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. యువకులు, పోతురాజులు డీజే చప్పుల మధ్య నృత్యం చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు, సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంధుమిత్రులతో సందడి వాతావరణం నెలకొంది.