19-07-2025 02:37:12 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఆధ్వర్యంలో ఎరువుల గోడౌన్ ముందు శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ.. గడిచిన పది సంవత్సరాలలో ఏనాడూ లేని ఎరువుల కొరత కాంగ్రెస్ పార్టీ వచ్చాక మొదలైందన్నారు. సమస్యను ముందుగా గుర్తించని కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల రైతులు బాధపడుతున్నారని చెప్పారు.
పాలనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి ఉండి కూడా రైతులకు సరిపడిన ఎరువులు సరఫరా చేయలేకపోవడంలో వారి అసమర్ధత కనిపిస్తుందని విమర్శించారు. అనంతరం రైతులకు సక్రమంగా ఎరువులు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఇల్లెందు ఏడిఏ లాల్ చందు, మండల వ్యవసాయ శాఖ అధికారి సతీష్ లకు వినతి పత్రం అందజేశారు.