calender_icon.png 20 July, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక, రాజకీయ, వ్యక్తిగత గొడవలతో.. చందునాయక్ హత్య

20-07-2025 01:42:27 AM

  1. సీపీఐ నేత హత్య కేసు ఛేదించిన పోలీసులు
  2. ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురు అరెస్ట్
  3. ప్రాణహాని ఉందనే చంపించా: ప్రధాన నిందితుడు రాజేశ్
  4. హత్య కేసు వివరాలను వెల్లడించిన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్

మలక్‌పేట్, జూలై 19 (విజయక్రాంతి): సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కేతావత్ చందునాయక్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ హత్యకు పాల్పడింది ఆరుగురు కాగా, ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న ఉదయం ముసరాంబాగ్‌లోని శాలివాహననగర్ పార్క్‌లో చందు నాయక్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపుచర్యలు చేపట్టి వారి సమాచారం తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు.

చందునాయక్ తనను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీయడం, వ్యక్తిగత విషయాలతో పాటు అతడితో తనకు ప్రాణహాని ఉందని భావించిన ప్రధాన నిందితుడు ఉప్పల్ భగాయత్ సత్యనగర్ కాలనీకి చెందిన దొంతి రాజేశ్ మరో ఐదుగురితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సాయంత్రం సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ వెల్లడించారు.

2022లో హయత్‌నగర్ కుంట్లూరు ప్రాంతంలో దాదాపు 100 ఎకరాల భూదాన్ భూముల్లో పేదలతో సీపీఐ తరపున చందునాయక్,  దొంతి రాజేశ్  ఇద్దరు కలిసి గుడిసెలను వేయించారు. ఆ తర్వాత వారికి పట్టాలు ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. రాజేశ్ కూడా తన తరుఫున కొందరితో గుడిసెలు వేయించాలని భావించాడు. గుడిసెలు వేయించేందుకు రాజేశ్ 1300మంది నుంచి రూ.13లక్షలు డబ్బులు వసూలు చేసి చందుకు ఇచ్చాడు.

అయితే వాటిని తనకు ఇవ్వలేదని చందు బుకాయించాడు. దీంతో పార్టీ ముందు పరువు పోయిందని రాజేశ్ భావించాడు. అలాగే వీరిద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వివాదాలు కూడా సెటిల్ చేశారు. ఒక బిల్డర్ వద్ద రూ.12లక్షలు వసూలు చేశారు. సెటిల్‌మెంట్ ద్వారా వచ్చిన డబ్బు ఇవ్వలేదని, పార్టీకి దూరం చేశాడని రాజేశ్ కోపం పెంచుకున్నాడు. దీంతోపాటు చందునాయక్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానపడ్డాడు.

ఇదిలా ఉండగా తన వివాహేతర సంబంధానికి సంబంధించిన విషయంలో తన అనుచరులతోనే పార్టీకి ఫిర్యాదు చేయించడంపై మరింత పగ పెంచుకున్నాడు. చందునాయక్ తనను మోసగించాడని, అతడి వల్ల తనకు రూ. 50 లక్షలు ఆర్థిక నష్టం, రాజకీయంగా దెబ్బతీయడం, వీటితో పాటు అతడితో తనకు ఎప్పుడైనా  ప్రాణహాని ఉందని భావించి ఎలాగైనా చంపాలని రాజేశ్ నిర్ణయించుకున్నాడు.

పాత నేరగాళ్లు అయిన కర్మన్‌ఘాట్ భూపేశ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఏడుకొండలు, ప్రజాప్రతినిధి పార్టీకి చెందిన శ్రీను, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లయ్య పాలెం, గిరిజన కాలనీకి చెందిన అర్జున్ ప్రకాశ్, శ్రీకాకుళం జిల్లా మైపాడుకు చెందిన రాంబాబు, యాదాద్రి భువనగిరి ప్రాంతానికి చెందిన కందుకూరి ప్రశాంత్‌తో కలిసి రాజేశ్ పథకం రచించారు.

హత్య చేశారిలా..

రాజేశ్ తన ఐదుగురు అనుచరులతో కలిసి చందును చంపడానికి ఓ కారులో ఈ నెల 15న ఉదయం అతడి  ఇంటి ముందు కాపుకాశారు. అక్కడ అవకాశం దొరకకపోవడంతో మలక్‌పేట్ శాలివాహననగర్ జీహెచ్ ఎంసీ పార్క్ వద్ద చంపాలని నిర్ణయించుకున్నారు. ఐదుగురితో కలిసి రాజేశ్ అక్కడకు చేరుకున్నాడు. తుపాకులతో పాటు కారం, కత్తులు కూడా కారులో పెట్టుకున్నారు. తుపాకులు విఫలమైతే కత్తులతో నరికేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. 

చందు పార్క్ నుంచి బయటకు రాగానే ముందుగా ప్రశాంత్ కళ్లలో కారం పొడి చల్లాడు. అర్జున్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. చందు తప్పించుకుంటే అతడిని కత్తులతో చంపేందుకు రాంబాబు సిద్ధంగా ఉన్నాడు. అయితే చందు కాల్పుల్లోనే చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి పారిపోయారు. 

క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని 3 ఫైర్ కాట్రిడ్జ్, రెండు మిస్సయిడ్ బుల్లెట్లు, రక్తపు మడుగులో ఉన్న బట్టలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మూడు లీడ్స్ లభించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. టెక్నికల్ అనాలసిస్, సంఘటనా స్థలంలో వేలిముద్రల ఆధారంగా అర్జున్ ప్రకాశ్, లింగి బేడి రాంబాబును గుర్తించామని, వీరు నెల్లూరు వైపు పారిపోతుండగా 18న కావలి వద్ద అదుపులో తీసుకున్నట్టు తెలిపారు.

వీరిని విచారించడంతో అనేక దోపిడీ దొంగతనాల్లో కేసులు ఉన్నట్లు వివరించారు. రహస్య సమాచారం మేరకు దొంతి రాజేశ్‌ను మరికొందరిని జనగామ జిల్లా ప్రాంతంలో 19న అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి పిస్తోల్, రివాల్వర్, బంగారం, నగదు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. వీరిని విచారించగా వారు చేసిన నేరాలను అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. 

మరో నిందితుడు కుంభ ఏడుకొండలు పరారీలో ఉన్నాడు. ఈ కేసును అడిషనల్ డీసీపీ కే శ్రీకాంత్, ట్రాన్స్‌పోర్ట్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు, ఏసీపీ సుబ్బిరామిరెడ్డి, మలక్‌పేట సీఐ పీ నరేశ్, జయశంకర్ కేసును చాకచక్యంగా ఛేదించారని డీసీపీ వివరించారు.