20-07-2025 07:07:16 PM
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ గాంధారి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. బోనాల జాతరకు కోల్ బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పక్క జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు వాహనాలకు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
జాతరకు కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) బోనల జాతర ర్యాలీలో పాల్గొని మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గాంధారి మైసమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జాతర జాతీయ రహదారి పక్కన జరుగుతున్నందున పోలీసులు భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారిపై బారీకేడ్ల ఏర్పాటు, రోడ్డు మార్గాల వద్ద పోలీస్ పెట్రోలింగ్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిసిపి భాస్కర్ పేర్కొన్నారు. గాంధారి మైసమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.