20-07-2025 08:42:12 PM
పాపన్నపేట: ఏడుపాయల దుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj) కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఆదివారం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వారి పేరున ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మవారి కృప వల్ల జిల్లాలో వర్షాలు అనుకున్న స్థాయిలో కురవాలని రైతులు పాడిపంటలతో, జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్రీనివాసరావు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
పుష్పాంబరిగా ఏడుపాయల వన దుర్గమ్మ
తెలంగాణలోనే ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆషాడ మాసం సందర్భంగా నాలుగవ ఆదివారం నాడు పుష్పంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ అర్చకులు వివిధ రకాల పుష్పాలను సేకరించి అలంకరించారు. మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించగా, పోలీస్ సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు.