24 May, 2026 | 1:11 PM

ఓటు వేయం.. చైతన్యాన్ని చాటం!

19-04-2024 12:48 AM

ఓటింగ్‌పై ‘గ్రేటర్’వాసుల అనాసక్తి 

l ఎన్నిక ఏదైనా నామమాత్రంగా పోలింగ్‌శాతం నమోదు

l గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నాలుగు స్థానాల్లో 

l 50 శాతం కంటే తక్కువ పోలింగ్‌శాతం

l ‘హైదరాబాద్’ స్థానంలో కేవలం 44.85శాతం పోలింగ్

l పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాం తి): గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓటర్లు ఏ ఎన్నిక అయినా ఓటు వేయడానికి ఆసక్తి చూపుతారు. ఏదైనా కారణంతో తమ ఓటర్ స్లిప్ రాకపోతే తమకు తాము చిన్నబుచ్చుకుంటారు. అవసరమైతే సర్కార్ అధి కారులు, సిబ్బందితో తగవుకు దిగుతారు. పట్టుబట్టి తమ ఓటు హక్కు సాధించుకుంటారు. చివరకు ఓటు హక్కు వినియోగిం చుకుంటారు. అందుకు ఎన్ని గంటలైనా క్యూలో నిలబడతారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ఓటు వేశానని గర్వంగా చెప్పుకుంటారు. కానీ నగరాల్లో నివసిస్తున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూప డం లేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఏఎన్నిక అయినా రానురాను పోలిం గ్ శాతం తగ్గుతూ వస్తున్నది. అందుకు ఎన్నికలపై ఆసక్తి లేకపోవడం, నిర్లక్ష్యం, బద్ధకం ఇలా కారణేలేమైనా చెప్పుకోవచ్చు. 

2019 ఎన్నికల్లో పోలింగ్ ఇలా..

2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో 50శాతం కంటే తక్కువ పోలింగ్‌శాతం నమోదైన స్థానాల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల  పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇవే ఎన్నికల్లో జాతీయస్థాయిలో సగటు 67.4 శాతం కంటే తక్కువగా పోలింగ్ జరిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 62.7శాతం ఓట్లతో  ఏడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యల్పంగా ఓటింగ్‌శాతం నమోదైన పార్లమెం ట్ సెగ్మెంట్లలో హైదరాబాద్ 44.85 పోలింగ్‌శాతం నమోదు చేసి దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరసలో సికింద్రాబాద్ ఏడో స్థానం, మల్కాజ్‌గిరి 12వ స్థానం, చేవెళ్ల 25వ స్థానంలో నిలిచాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హైదరాబాద్ స్థానంలో 45.58 శాతం,  సికింద్రాబాద్‌లో 50.55 శాతం, మల్కాజ్‌గిరిలో 46.84 శాతం, చేవెళ్లలో 65.69 శాతం మాత్రమే పోలింగ్‌శాతం నమోదైంది.

విస్తీర్ణం.. ఓటర్ల సంఖ్య ఇలా..

దేశంలో తొలిసారి జరిగిన లోక్‌సభ (1951 ఎన్నికల్లో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో నగరాలు, పట్టణాలకు చెందిన ఓటర్లు కేవలం 17 శాతం మాత్రమే. కానీ దశాబ్దాలు గడుస్తుండగా అర్బనైజేషన్ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు క్రమక్రమంగా పెరిగాయి. ఇక హైదరాబాద్ వంటి మహానగరాల సంగతైతే ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 21.97 లక్షల మంది ఓటర్లు, సికింద్రా బాద్ పరిధిలో 20.98 లక్షల మంది, మల్కాజ్‌గిరి పరిధిలో 37.38 లక్షల మంది, చేవెళ్ల పరిధిలో 29.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. విస్తీర్ణపరంగా 78.12 చ.కిమీతో హైదరాబాద్  పార్లమెంట్ స్థానం రాష్ట్రంలోనే చిన్నది. అలాగే ఓటర్ల పరంగా 37.38 లక్షల మందితోఒ మల్కాజ్‌గిరి అతిపెద్ద పార్లమెంట్ స్థానంగా నిలుస్తున్నది.

పోలింగ్‌శాతం పెరగకపోవడానికి కారణాలు..

ఏటికేడు ఓటర్ల సంఖ్య పెరగుతున్నప్పటికీ ఆ స్థాయిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడం లేదు. ఉద్యోగం, ఉపాధి, విద్యతోపాటు ఇతర కారణాలతో ఎంతోమంది ఓటర్లు  ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. పోలింగ్ రోజూ యాజమాన్యాలు ఉద్యోగులు, సిబ్బందితో పనిచేయిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో నిలబడే ఓపిక నగరప్రాంతాలకు చెందిన ఓటర్లకు ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కొందరికి రెండు చోట్ల ఓట్లు ఉండడమూ పోలింగ్ శాతం తగ్గడానికి కారణం. 

ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు ఉండాలి..

నగరాలు, పట్టణాలు పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు పెంచాలి. పోలింగ్ రోజు యాజమాన్యాలు ఉద్యోగులు, సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. పోలింగ్ బూత్‌కు వెళ్లే రూట్ మ్యాప్‌ను ఓటర్లకు వాట్సప్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  రెండు చోట్ల ఓట్లు ఉన్నవారిని గుర్తించి వారికి ఒకేచోట ఓటు హక్కు కల్పించాలి. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఈసీ మారథాన్, 2కే రన్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. సామాజిక మాధ్యమాల్లో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రభావవంతంగా ప్రచారం చేయాలి.

2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం 

లోక్‌సభ స్థానం హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి చేవెళ్ల 

ఓటర్ల సంఖ్య 21,97,531 20,98,347 37,36716 29,06213

పోలింగ్ శాతం 44.84% 46.50% 49.63 % 53.35 %