calender_icon.png 21 July, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 ని తీసుకొచ్చి ఆదివాసి ప్రజలను అడవికి దూరం చేయవద్దు

20-07-2025 10:46:31 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమురం భీం కన్జర్వేషన్(Kumram Bheem Conservation) కారిడార్ పేరిట జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, ఓయూ జేఏసీ నేత  సాగబోయిన పాపారావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జూలై 21న సోమవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ కు ఐక్య ఆదివాసి సంఘాలు పిలుపు నివ్వడం జరిగిందనీ, ఆదివాసి ఐక్య సంఘాలు తలపెట్టిన బందుకు ఆదివాసీ విద్యార్థి సంఘం, ఓయూ జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు కేటాయించి అడవుల్లో నివసించే జంతువులపై చూపే ప్రేమ, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిపై పాలకులు ఎందుకు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ ల పేరుతో, వన్యప్రాణ సంరక్షణ పేరుతో ఆదివాసి జీవన విధ్వంసం చేస్తున్నారు. ఖనిజ సంపదపై కన్నేసి బయోడైవర్సిటీ పేరుతో బలవంతంగా ఆదివాసులను అడవుల నుండి గెంటేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాలు జీవో నెంబర్ 49ని తీసుకువచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతాలలోని 339 ఆదివాసీ గూడెలను కాళీ చేయించి 1,49,889 హెక్టార్లు, సుమారు మూడు లక్షల ఎకరాల అటవీ భూమి స్వాధీనం చేసుకునేందుకు మరో కొత్త నాటకానికి తెర లేపారన్నారు.

అడివే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న ఆదివాసులపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న కుట్రలను తిప్పి కొట్టి ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలను, ప్రాంతాన్ని   కాపాడుకోవాల్సిన బాధ్యత మానవతావాదులుగా మనందరిపై ఉందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70 యాక్ట్, పేసా గ్రామసభ, 2006 అటవీ హక్కుల చట్టం, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను ఆదివాసీల మనుగడను ఆదివాసిలకు ఉన్న హక్కులు, చట్టాలను ఉల్లంఘిస్తూ ఏటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49ని  వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క బందులో అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, యువజన, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు, మేధావులు, బుద్ధి జీవులు, కార్మిక కర్షక వర్గాల ప్రజలు, మహిళలు మద్దతు తెలిపి బందును విజయవంతం చేయాలని ఆయన కోరారు.