21-07-2025 12:42:50 AM
తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరిన రైతు
కామారెడ్డి, జూలై 20 (విజయ క్రాంతి), తనకున్న 20 గుంటల భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని షాదీపూర్ గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతుకు 20 గుంటల భూమి ఉండగా ఆ భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు.
తన భూమి తనకు ఇప్పించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగాడు. సర్వేయర్ ను పెట్టి భూమిని కొలత చేయించాడు. తనకు రావలసిన ఇరవై గుంటల భూమి గ్రామానికి చెందిన ముగ్గురు కబ్జా లో ఉందని సర్వే అధికారులు తేల్చారు. అయినా కబ్జా చేసిన భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు ఇవ్వకపోవడంతో కలత చెందిన శబ్దీపూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు ఇంటి సమీపంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తాను ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసి తన స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని కలత చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులకు ఆ స్థలాన్ని ఇప్పించాలని కోరారు. ఆదివారం కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న దేవుని పల్లి పోలీసులకు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ఈ స్థల వివాదం కోర్టులో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.