20-07-2025 02:22:46 PM
సంతోషంతో రైతన్నలు
వలిగొండ,(విజయక్రాంతి): గత పది రోజుల క్రితం వరకు వర్షాలు లేక రైతన్నలు ఆకాశం వైపు దిగాలుగా కూర్చుని చూసేవారు. కాగా గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న తాజా వర్షాలతో మెట్ట పంటలైన పత్తి, కంది చేనులు కళకళలాడుతుండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వలిగొండ మండలంలో మూసీ ఎగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలలో ఎక్కువగా రైతులు వందలాది ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తుంటారు. అయితే ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో రెండుసార్లు వర్షాలు కొరయడంతో రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవడం జరిగింది.
అయితే తర్వాత దాదాపు 20 రోజులకు పైగా వరుణుడు ముఖం చాటేయడంతో వర్షాలు లేక కొన్ని పత్తి విత్తనాలు భూమిలోనే మాడిపోగా, మొలికెత్తిన పత్తి మొలకలు వర్షం కోసం ఎదురుచూస్తూ ఎండకు తలలు వాల్చుతూ కనిపించాయి. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో కరుణించి వర్షాలు కురిపిస్తుండడంతో పత్తి మొక్కలు తలెత్తుకొని కళకళలాడుతున్నాయి. ఇదేవిధంగా వర్షాలు కురిసినట్లయితే తమకు పెట్టుబడులతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని రైతులు, తమకు చేతినిండా పనులు దొరుకుతాయని వ్యవసాయ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.