19-07-2025 05:43:46 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎరువుల డీలర్లు రైతులకు ఈ పాస్ యంత్రాల ద్వారా ఎరువులను విక్రయించాలని కేసముద్రం మండల వ్యవసాయ అధికారి భానోత్ వెంకన్న(Mandal Agriculture Officer Bhanot Venkanna) ఆదేశించారు. వ్యవసాయ అధికారి వెంకన్న కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల అమ్మకం కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. ప్రతి ఎరువుల డీలరు యూరియా, ఇతర ఎరువులను ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్, గోదాం బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ సమానంగా ఉండేటట్లు ప్రతిరోజు చూసుకోవాలని సూచించారు. స్టాక్ బోర్డులు, ఇన్వాయిస్ లు, ఓ ఫామ్ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎవరైనా డీలరు ఎరువుల కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా, ఎరువులు నియంత్రణ చట్టం 1985, నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు.
కేసముద్రము మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 323 మెట్రిక్ టన్నుల యూరియా, డిఏపి 53 మెట్రిక్ టన్నులు, పోటాష్ 44 మెట్రిక్ టన్నులు, సూపర్ 115 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 534 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. రైతు సోదరులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎరువులు కావలసిన రైతులు ఆధార్ కార్డు తీసుకువెళ్లి పొందాలని వారు సూచించారు. ప్రస్తుతము పత్తి, మొక్కజొన్న పంట 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నందున పంటలలో మోతాదుకు మించి యూరియా వాడినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద, కలుపు బెడద ఎక్కువై పంటకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులను మొక్కకు కావలసిన మోతాదులోనే వేయాలని కోరారు. రైతులకు నానో యూరియా వినియోగం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నట్లు చెప్పారు.