calender_icon.png 20 July, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మణ వెల్లెంలను పూర్తిగా నింపండి

20-07-2025 01:02:19 AM

  1. 50 చెరువులు నింపే కెనాల్స్ పూర్తి చేయాలి
  2. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, జూలై 19 (విజయక్రాంతి): బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌ను రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం తనిఖీ చేశారు. రిజర్వాయర్‌లో రెండు పంపుల ద్వారా ఇప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటి నిల్వలపై అధికారులను ఆరా తీశారు. ఉదయ సముద్రం నుంచి ఇప్పటి వరకు 0.20 టీఎంసీలు లిఫ్ట్ చేశామని వివరించారు.

నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతున్నందున రెండు పంపుల ద్వారా ఒక్కో పంపు 460క్యూసెక్కుల కెపాసిటీ చొప్పున రోజుకు 920 క్యూసెక్కుల నీటిని ఉదయ సముద్రం నుంచి లిఫ్ట్ చేసి రిజర్వాయర్ ఫుల్ లెవల్ 0.305 టీఎంసీ వరకు నింపాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. రిజర్వాయర్ కింద చెరువులు నింపి సాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసుకుంటున్న లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా 30చెరువులు, రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 20చెరువులు నింపేందుకు వీలుగా వర్క్ ఏజెన్సీలు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు.

ఫీడర్ చానెల్ కెనాల్ తవ్వకానికి ఎస్టిమేట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ మండలం దోమలపల్లి గ్రామ చెరువు అతి త్వరలో సుమారుగా 10రోజుల్లో నింపి సాగు నీరు అందించేందుకు నిర్విరామంగా పని చేయాలన్నారు. ప్రాజెక్ట్ కింద భూసేకరణ ద్వారా భూమి కోల్పోయిన రైతుల ఖాతాల్లో వెంటనే పరిహారం డబ్బులు జమ చేయాలని ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్‌ను ఫోన్లో ఆదేశించారు.

గత డిసెంబర్‌లో ప్రారంభించుకున్న ఈ రిజర్వాయర్ ద్వారా ఇప్పటి వరకు 15వేల ఎకరాలకు సాగు నీరు అందించామని చెప్పారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే తన సంకల్పమని మంత్రి పునరుద్ఘాటించారు. మంత్రి తనిఖీకి వెళ్లినప్పుడు ఫీల్డ్ విజిట్‌లో ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లను అభినందించారు. మంత్రి వెంట ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ విఠలేశ్వర్, డిప్యూటీ డీఈ పిచ్చయ్య, ఏఈఈలు రాజశేఖర్, నవీన్, జితేందర్ తదితరులు ఉన్నారు.