20-07-2025 01:00:13 AM
విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 19: హైదరాబాద్ నగరంలో వర్షం మరోసారి దంచి కొట్టింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కాప్రాలో 7.78 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకాగా, మల్కాజిగిరిలో 6.85 సెం.మీ., ఉప్పల్‌లో 6.63 సెం.మీ.ల వర్షం కురిసింది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఇంత భారీ వర్షాపాతం నమోదు కావడంతో రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి.
రోడ్ల మీద నీరు నిలవ డంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఉప్పల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో వర్ష ప్రభా వం అధికంగా ఉంది. అంతకుముందు రోజు కురిసిన భారీ వర్షం నుంచి కోలుకునే లోపే మళ్లీ దంచికొట్టడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు. ఆఫీసుల నుంచి ఉద్యోగులు, స్కూళ్ల నుంచి విద్యార్థులు ఇళ్ల కు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ సమ స్య తీవ్రమైంది. గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల సమయం పట్టింది.
శనివారం సెలవు కావడంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు పెద్దగా లేవు. నగరంలో కురిసిన వర్షాలకు తలెత్తిన సమస్యల పరిష్కా రంలో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వర్షా ల వల్ల ఇబ్బందులు తలెత్తితే హైడ్రా హెల్ప్‌లైన్ నంబర్ 9000113667 ను సంప్రదిం చాలని అధికారులు చెబుతున్నారు. జీహెఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-21111111ని కూడా సంప్రదించవచ్చు.
లోతట్టు ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ పర్యటన
నగరంలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ర్ట అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డితో కలిసి తార్నాక డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. వర్షం కారణంగా ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకొని, వెంటనే నివారణ చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిహెఎంసి అధికారు లు అప్రమత్తంగా ఉండి, వర్షం ప్రారంభమైన వెంటనే రోడ్డుపై ఉన్న స్టార్మ్ వాటర్ డ్రైన్లలో బ్లాకేజెస్ పరిశీలించి తొలగించే చర్యలు చేపట్టాలని డిప్యూటీ మేయర్ సూచించారు.
పొంగిపొర్లిన భీమ లింగం కాలువ
గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి భీమలింగం కాలువ పొంగిపొర్లింది. దీంతో పలు ఇండ్ల నుంచి పలు కాలనీలకు భారీగా వరద నీరు పారింది. అధికారులు వెంటనే స్పందించి చేపట్టి భీమలింగం కాలువకు అడ్డంగా ఉన్న పైపులైన్లను తొలగించారు. దీంతో నీరు కాలువలో సాఫీగా ప్రవహించి, పొంగిపొర్లడం ఆగిపోయింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తు న్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వీడియో సందేశం ద్వా రా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో వర్షాలపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్ ఇతర అధికారులను అప్రమత్తం చే శారు. నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా సిబ్బంది వెంటనే తొలగిస్తున్నారని వెల్లడించారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకున్నామన్నారు.
వాగులో చిక్కుకున్న ఐదుగురు యువకులు
అకాలవర్షం రావడంతో వాగులో ఐదుగురు యువకులు చిక్కుకున్న ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. అమర్లబండ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో అకాల వర్షం కురవడంతో గ్రామ సమీపంలో ఉన్న వాగులో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలుపడంతో హైరానా పడ్డారు. వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ట్రాక్టర్ సహాయంతో గంటపాటు శ్రమించి, యువకులను ఒడ్డుకు చేర్చారు.