17-12-2024 02:28:14 AM
నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభం
ప్రకటించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళనల మధ్య సోమవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యులు సభ సక్రమంగా సాగించేందుకు సహకరించకపోవడంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ మంగళవా రానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటకాభివృద్ధి విధానంపై సభలో మాట్లాడుతుండగా.. లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టా లని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఇది దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు. రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. చర్చకు అనుమతించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. సభ్యుల ప్లకార్డులు తీసుకురావాలని మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశాలిచ్చారు. ప్లకార్డులు మార్షల్స్‌కి ఇస్తే మాట్లాడే అవకాశమిస్తామని స్పీకర్ స్పష్టంచేశారు. కొత్త సభ్యులకు బీఆర్‌ఎస్ సభ్యులు ఏం నేర్పుతున్నారని స్పీకర్ ప్రశ్నించారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య సభను వాయిదా వేశారు. సభ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వాయిదా పడిన తర్వాత కూడా అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ నిరసన తెలిపింది.