19-07-2025 07:53:26 PM
కట్టు బట్టలతో మిగిలిపోయిన పేద కుటుంబం
కుభీర్,(విజయక్రాంతి): మండలంలోని చాత గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం నివసించే ఇల్లు అగ్ని ప్రమాదంలో ఆహుతైంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం చాత గ్రామానికి చెందిన పూజారి శాంతా బాయి కి చెందిన నివాసముండే రేకుల పైకప్పు కలిగిన ఇంటిలో మధ్యాహ్నం స్తంభం నుండి ఇంటిలోకి వచ్చే విద్యుత్ తీగెలు ఒకదానికొకటి చుట్టుకుని ఇంట్లో మంటలు చెలరేగడంతో అందులో నుండి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. ఇరుగు పొరుగు వారు గమనించి శస్త్ర చికిత్స చేసుకొని భైంసా పట్టణంలోని ఆసుపత్రిలో ఉన్న శాంతాబాయికి సమాచారం అందించారు.
తలుపులు తీసి మంటలను ఆర్పమని ఆమె కోరడంతో గ్రామస్తులు వెంటనే భైంసా లోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటంతో గ్రామానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఇంట్లో ఉన్న రూ. 50 వేల నగదు, నిత్యవసర సరుకులు, బట్టలు, వంట పాత్రలు, టీవీ, బీరువా, సిలిండరు, పట్టా పాస్ పుస్తకాలు, వివిధ డాక్యుమెంట్లు, కుమారుడి విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఇంటిలోని ఏ చిన్న వస్తువు కూడా మిగలకుండా పోయింది.
సుమారు రూ.3 నుండి రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయిన కుటుంబ సభ్యుల రోదనలు అక్కడివారిని కలిచి వేశాయి. కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన నష్టం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. కట్టుబట్టలే మిగలడంతో తమను ప్రభుత్వం తో పాటు దాతలు ఆదుకోవాలని వేడుకున్నారు.