20-07-2025 07:10:14 PM
పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ..
మహబూబాబాద్ (విజయక్రాంతి): అటవీ సంరక్షణ మానవ మనుగడపై ఆధారపడి ఉందని, జీవవైవిద్యానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పీసీసీఎఫ్ డాక్టర్ సిహెచ్ సువర్ణ(PCCF Dr. Suvarna) అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివారం పీసీసీఎఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా గూడూరు, గంగారం, కొత్తగూడ మండలాల్లో నిర్వహిస్తున్న ప్లాంటేషన్స్, పర్యాటక కేంద్రాలు, భీముని పాదం, గుంజేడు ముసలమ్మ దేవాలయం సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. భీముని పాదం వద్ద పర్యాటకులకు వసతుల కల్పనపై సమీక్షించారు.
జీవవైవిద్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ఆదేశించారు. వన్యప్రాణి రక్షణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. వివిధ చోట్ల ఏర్పాటుచేసిన వాచ్ టవర్లను పరిశీలించారు. గుంజేడు దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టే పనులకు అటవీశాఖ అనుమతుల విషయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి అటవీ సర్కిల్ సిసిఎఫ్ బీమా నాయక్, మహబూబాబాద్ డీఎఫ్ఓ విశాల్ బత్తుల, డీఎఫ్ఓ రవికుమార్, ఏసిఎఫ్ చంద్రశేఖర రావు, ఆయా సెక్షన్ల అటవీశాఖ అధికారులు సురేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.