19-07-2025 08:18:32 PM
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్ లో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డుల అవగాహన కార్యక్రమం శనివారంతో ముగిసింది. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి కె.రాము మాట్లాడుతూ నవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ఆవిష్కరణలు ఉండాలన్నారు. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్ ను ఏర్పాటు చేసి, విద్యార్థులచే సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తింపచేసి వాటిని ఒక పేపర్ పైన రాసి ఐడియా బాక్స్ లో వేసేలా ప్రోత్సహించాలన్నారు.
బాక్స్ లో వేసిన అంశాల ఆధారంగా అందరితో చర్చించి సమాజంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కరించే లాంటి నూతన ఆవిష్కరణలు రూపొందిస్తే అవి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యే అవకాశం ఉంటుందన్నారు. నాణ్యమైన, ఉత్తమమైన ఆలోచనలతో నామినేషన్లు వేసేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.