calender_icon.png 20 July, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

19-07-2025 07:36:32 PM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

కోనరావుపేట మండలం శ్రీనివాస గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్..

కోనరావుపేట (విజయక్రాంతి): జిల్లాలో నూతన రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(State Government Whip Aadi Srinivas) అన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని శ్రీనివాస గార్డెన్స్ లో కోనరావుపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందన్నారు. కోనరావుపేట మండలంలో 889 నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, 1806 మంది పేర్లను నూతనంగా నమోదు చేయటం జరిగిందని వీటి ద్వారా దాదాపు 2696 మంది పేదలకు అదనంగా రేషన్ అందుతుందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 61 వేల నూతన రేషన్ కార్డులు మంజూరు, 27 లక్షల 83 వేల అదనపు ఇంటి సభ్యులను రేషన్ కార్డుల్లో నమోదు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. ధనికులకు పేదలకు తేడా లేకుండా ఉచిత సన్నం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక్కా రేషన్ కార్డు కూడ మంజూరు చేయలేదన్నారు. కేసిఆర్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లతో అప్పుల కుప్పగా మార్చి ఆర్థికంగా విధ్వంసం చేశారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కా పథకాన్ని రద్దు చేయకుండా నూతన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించామని అన్నారు.

ఆరోగ్య శ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను కొనసాగిస్తూ అదనంగా పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, 25 లక్షల రైతులకు 2 లక్షల వరకు పంట రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెసిడెన్షియల్ పాఠశాలలో 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీల పెంచామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దేశంలోనీ పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రారంభం చేసిందని అన్నారు. గత పది సంవత్సరాలలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి పేద ప్రజలను నిలువునా కేసిఆర్ మోసం చేశాడని దుయ్యబట్టారు. గల్ఫ్ లో ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్రంలోనే కోనరావుపేట మండలంలో అమలు చేశామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని అమలు చేసేందుకు పంచాయతీ రాజ్ చట్టం-2018కి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిండు మనసుతో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దివించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాల్లపల్లి ప్రభాకర్, డిఎం సివిల్ సప్లై రజిత, ఎంఈఒ మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బండి ప్రభాకర్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరక్టర్లు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.