calender_icon.png 20 July, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను అన్ని రంగాలలో బలోపేతం చేయడానికే మహిళా శక్తి కార్యక్రమం

19-07-2025 06:23:57 PM

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): మహిళలను అన్ని రంగాలలో బలోపేతం చేయడానికే మహిళా శక్తి కార్యక్రమంను ప్రభుత్వం అమలు చేస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Welfare Minister Adluri Laxman Kumar) అన్నారు. శనివారం ధర్మపురి నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు సాధికారత కల్పించడానికి, అన్ని జీవనోపాధి అంశాలలో మహిళలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

అదేవిధంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ రాయితీ కింద 4 వేల 683 స్వశక్తి సంఘాలకు రు.5 కోట్ల 70 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 40 పట్టణ మహిళా పొదుపు సంఘాలకు 32 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా 10 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేశారు. మహిళల జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించడం తో పాటు లోన్ బీమా, ప్రమాద బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మహిళల ఆదాయం పెంచెందుకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పాడి పశువుల పెంపకం, ఇందిరా శక్తి క్యాంటీన్, ఆర్టిసి కి అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ వంటి వివిధ వ్యాపారాలు చేయడం వల్ల నెలకు మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.  ఆర్టిసి కి పెట్టిన అద్దె బస్సు ద్వారా నెలకు రూ.70 వేల  ఇస్తున్నామన్నారు. మహిళా సంఘాలు వారికి అందే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రు.10 లక్షలు అందిస్తున్నామన్నారు. మహిళ సభ్యులు సాధారణంగా మరణిస్తే 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా అమలవుతుందని అన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలలలో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌళిక వసతుల ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేస్తూ వారికి పనులను కేటాయించడం జరిగిందన్నారు. 127 ప్రభుత్వ స్కూళ్ళలో మరమ్మతులు చేయించడం జరిగిందని, ధర్మపురి నియోజకవర్గం కు 5 కొత్త బస్సులు ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్, ధర్మారం కు మంజూరు అయినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మహిళ సభ్యురాలికి ప్రమాద బీమా, లోన్ బీమా కల్పించామని, ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యులకు రు.10 లక్షల పరిహారం అందుతుందని, సహజ మరణం పొందితే ఆ సభ్యురాలి పేరిట ఉన్న రుణం గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ అవుతుందన్నారు. ‌ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, డిఆర్డిఓ రఘువరన్, సంబంధిత అధికారులు, మండల సమాఖ్య సభ్యులు, ఏ.పి.ఎం.లు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.