calender_icon.png 20 July, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర అభ్యాసంతోనే కృత్రిమ మేధపై పట్టు

19-07-2025 10:04:46 PM

గీతం 16వ స్నాతకోత్సవంలో నాస్కామ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్..

- 2002 మందికి పట్టాల ప్రదానం 

– 32 మందికి బంగారు పతకాలు

– వంద మందికి పీహెచ్ డీలు

ప‌టాన్ చెరు (విజ‌య‌క్రాంతి): కృత్రిమ మేధస్సు యుగంలో నిరంతర అభ్యాసం అవశ్యమని, అప్ప‌డే యువతకు దానిపై పట్టు సాధించే వీలు కలుగుతుందని నాస్కామ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ అన్నారు. హైదరాబాద్ ప్రాంగణంలో శనివారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం(Gitam Deemed University) 16వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించాలని సూచించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రపంచంలో మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని, ప్రభావవంతమైన నాయకత్వం, సంబంధాల నిర్వహణ నేటి యువతలో కీలకమని ఆయన స్పష్టీకరించారు. గీతం అధ్యక్షుడు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ స్నాతకోత్తర పట్టాలను స్వీకరిస్తున్న వారంతా ఉన్నత లక్ష్యాలతో తమ కలలను నిజం చేసుకోవాలన్నారు.

అదే సమయంలో సమాజానికి తిరిగి ఇచ్చే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అధునాతన ధోరణులను అర్థం చేసుకోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధికి కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. గీతం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా మాట్లాడుతూ సంక్లిష్టమైన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులను సన్నద్ధం చేయడానికి తమ దృష్టి అనువాద పరిశోధన, అంతర్ విభాగ (ఇంటర్ డిసిప్లినరీ) అభ్యాసంపై ఉందని తెలిపారు. హైదరాబాద్‌ ప్రాంగణంలోని ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ విభాగాల నుంచి దాదాపు 2,002 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయగా, వీరిలో 1,638 మంది యూజీ, 264 మంది పీజీ విద్యార్థులు ఉన్నారు. పరిశోధన, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా పెద్ద సంఖ్యలో 100 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లను ప్రదానం చేయడం విశేషం. ఈ స్నాతకోత్సవంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 32 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు.

సమాజ పురోగతికి, నైతికతపై రాజీపడకుండా దేశ పురోగతికి కట్టుబడి ఉంటామని పట్టభద్రులు ప్రతిజ్జ చేశారు. శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణ, సామాజిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన అత్యుత్తమ కృషికి గుర్తింపుగా ముగ్గురు విశిష్ట వ్యక్తులకు గీతం గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. కల్పకంలోని ఇందిరా గాంధీ అణు పరిశోధనా కేంద్రం (ఐజీసీఏఆర్) పూర్వ డైరెక్టర్ డాక్టర్ బి.వెంకట్రామన్, భారతదేశ రక్షణ, అంతరిక్ష సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో అణు ఇంజనీరింగ్, విధ్వంసక రహిత మూల్యాంకనంలో తన మార్గదర్శక కృషికి గాను డాక్టర్ ఆఫ్ సైన్స్ (డీ.ఎస్సీ)ని అందుకున్నారు. ప్రఖ్యాత సామాజిక వ్యవస్థాపకుడు, తక్కువ ఖర్చుతో కూడిన శానిటరీ ప్యాడ్ తయారీ యంత్రాన్ని కనుగొన్న ప్యాడ్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన అరుణాచలం మురుగనాథంకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) అవార్డును ప్రదానం చేశారు.

భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మార్గదర్శక శక్తిగా నిలిచి, గ్రామీణ విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తూ ఆర్.వీ.ఆర్.గా పేరొందిన ఆర్.వెంకటేశ్వరరావును డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) అవార్డును ఇచ్చి సత్కరించారు. గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ, గీతం అదనపు ఉప కులపతులు ప్రొఫెసర్ వై.గౌతంరావు, ప్రొఫెసర్ డి.ఎస్.రావు, రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్, పాలక మండలి సభ్యులు, కేఎస్ పీపీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్ తదితరులు పట్టభద్రులవుతున్న విద్యార్థులను అభినందించారు. అధిక శాతం మంది విద్యార్థులు అటు ప్రాంగణ నియామకాలలో రాణించి అత్యున్నత వేతనాలు అందుకోవడమే గాక, గీతం నుంచి బంగారు పతకాలు, స్నాతకోత్తర పట్టాలను స్వీకరించడంతో, వారి తల్లిదండ్రులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.