19-07-2025 06:06:00 PM
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యామ్ నుంచి కృష్ణా నదిలో వరద నీరు తరలుతుండగా, జూరాల ప్రాజెక్టు నుంచి 15 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉరకలు వేస్తూ శబ్దాలతో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలానికి ఒక లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు ప్రవేశించగా, ప్రాజెక్టు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు 67 వేల క్యూసెక్కుల కంటే అధికంగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 881.60 అడుగులకు చేరుకుంది. మొత్తం 215.807 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో, బుధవారం నాటికి 196.561 టీఎంసుల నీరు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌కు 67,800 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. 1800 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 564.90 అడుగుల వద్ద నీరు ఉన్నది. అదేవిధంగా డ్యామ్‌లో మొత్తం 312 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 243టీఎంసీల నీరు ఉన్నది.