21-07-2025 12:40:41 AM
బాన్సువాడ, జులై 20 (విజయ క్రాంతి), పోలీస్ శాఖ పరంగా పకడ్బందీగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో, ఆయా గ్రామాల్లో వ్యాపారస్తు లు, దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొదట్లో సీసీ కెమెరాల నిర్వహణ బాగానే చేశారు. కానీ సుమారు రెండేళ్లుగా బాన్సువాడ పట్టణంలో సీసీ కెమెరాల నిర్వహణ గాలికి వదిలేయడంతో అస్తవ్యస్తంగా మారాయి.
బాన్సువాడ పట్టణంలో దొంగతనాలు, వాహన చోరీల నిందితులు కేసులు చేదించడంలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అధికారులకు సవాల్ గా మారింది. బాన్సువాడ పట్టణంలో గతంలో ఇక్కడ సిఐ గా పని చేసిన మహేష్ గౌడ్ అప్పట్లో సీసీ కెమెరా ఆవశ్యకతను ప్రజలకు అవగాహన కల్పించి పట్టణ ప్రజలకు, వ్యాపారస్తుల దాతల సహకారంతో 115 సీసీ కెమెరాలు పట్టణంలో పలు కాలనిలలో ప్రధాన రహదారిలో సీసీ కెమెరాలను బిగించారు.
సీసీ కెమెరా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఫలితంగా 115 నిఘా నేత్రాలు అన్ని ప్రాంతాల్లో పనిచేశాయి. ఇదే తీరులో బాన్సువాడ పట్టణ సిఐగా ఉన్న మహేష్ గౌడ్ హయంలోని బాగానే ఉన్నాయి. అధికారుల వరుస బదిలీలతో పోలీసింగ్ సేవలతో పాటు సిసి కెమెరాలను పట్టించుకోని వారు కరువయ్యారు. ప్రస్తుతం పట్టణంలో మొత్తం 115 కెమెరాలు కూడా సరిగా పనిచేయని దుస్థితి నెలకొంది.
ఆయా గ్రామాల్లో దాతల సహాయం తో సీసీ కెమెరాలు బిగించి, గ్రామ పంచాయతీ అనుసంధానం చేశారు. పలు గ్రామాల్లో, పట్టణాల్లో సిసి కెమెరాలు మూలన పడ్డాయి. పర్యవేక్షించే వారు లేకుండా పోయారు. సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో బాన్సువాడ కేంద్రంగా రాత్రి వేళల్లోనూ ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరం, ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది.
పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్, మినీ ట్యాంక్ బండ్, తాడ్కోల్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ఆయా ప్రధాన రోడ్డులో సీసీ కెమెరాల పనిచేయక పోవడంతో పట్టణ ప్రజలు పోలీస్ అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2023- బాన్సువాడ సంగమేశ్వర కా లనీ లోని మూడు ఆటోలు చోరీ అయ్యాయి.
ఇప్పటివరకు ఈ కేసును పోలీసులు చేదించలేదు. పోలీస్ శాఖ అధికారులు రాత్రి పూట పెట్రోలింగ్ చేయకపోవడంతో పాటు, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వరుస చోరీలు జరుగుతున్నాయని ఆయా కాలనీల ప్రజలు చెబుతున్నారు.
పట్టణంలో ఏవైనా నేరాలు సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేసి ప్రైవేటు వ్యక్తుల, దుకాణదారులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలపై ఆధార పడాల్సి వస్తుంది. పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల పనితీరుపై మరోసారి సమీక్ష చేసుకొని పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పరిశీలించి మరమ్మతులు చేపడతాం
బాన్సువాడ పట్టణ సీఐ మండల అశోక్ ను సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వివరణ కోరగా అధికారులతో చర్చించి త్వరలోనే సీసీ కెమెరాల మరమ్మత్తులు చేయించేందుకు కృషి చేస్తామన్నారు.
మండల అశోక్, పట్టణ సీఐ, బాన్సువాడ