19-07-2025 11:54:20 PM
ప్రతి విభాగంలో నిబంధనలకు తూట్లు
కమిషనర్ డ్రైవర్, అటెండర్ అకౌంట్లతో రూ.లక్షల్లో లావాదేవీలు
ఏసీబీ సోదాలో వెలుగులోకి
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ మున్సిపల్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. కమిషనర్ అన్ని తానై వ్యవహారాలు నిర్వహించినట్టు వెల్లడవుతోంది. మొన్నటి వరకు మున్సిపల్ కార్యాలయంగా ప్రత్యేక అధికారి పాలనలో సాగడంతో అధికారుల అవినీతికి అడ్డు ఆదుపు లేకుండా పోతుందనే ఆరోపణలను ఏసీబీ సోదాల్లో నిజమైంది. శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైన సోదాలు ప్రతి విభాగంలో శనివారం ఉదయం 6 గంటల దాకా నిర్వహించారు. అన్ని విభాగాల్లో పదుల సంఖ్యలో దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. శానిటేషన్ విభాగంలో తిరగని వాహనాలకు సైతం రోజువారి డిజిల్/పెట్రోల్ వాడినట్లు బిల్లులు డ్రా చేసినట్టు తెలుస్తోంది. మరమ్మతుల్లో ఉన్న స్వచ్ఛ ఆటోలకు సైతం డీజిల్ బిల్లులు డ్రా చేసినట్టు తెలుస్తోంది.
ఇల్లు లేకున్నా లక్షల రూపాయలు ఆమ్యామ్యాలు తీసుకొని ఇంటి నంబర్లు కేటాయించిన వైనం వెలుగు చూసింది. ఈ అంశాన్ని పలుమార్లు విజయక్రాంతి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విధితమే. అయితే ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఈ, డీఈలు ఏసీబీ అధికారుల ఎంట్రీతో అదృశ్యం అవటం గమనార్హం. అనుమతులు లేకుండా ఇబ్బడీ ముబ్బడిగా బహులంతస్తుల నిర్మాణాలు, జి ప్లస్ టు భవనాలు, డ్రైనేజీ, రోడ్లను ఆక్రమించి అక్రమంగా భవనాలు నిర్మించిన పట్టణ ప్రణాళిక అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం, లక్షల రూపాయల చేతులు మారాయి అనడానికి సాక్ష్యం గా నిలుస్తుందని తెలుస్తోంది. కమిషనర్ డ్రైవర్, అటెండర్‌ల ఖాతాల ద్వారా రూ.లక్షల్లో లావాదేవీలు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక సమాచారాన్ని సేకరించిన ఏసీబీ డీఎస్పీ వై రమేష్ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.