calender_icon.png 19 July, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట

19-07-2025 06:12:17 PM

డి.ఎస్.పి తిరుపతిరావు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట వేయచ్చని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కలవలలో జరిగిన దొంగతనంలో నిందితులను పట్టుకున్న ఘటన మరోసారి రుజువు చేసిందని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు(DSP Tirupati Rao) అన్నారు. కల్వల గ్రామానికి చెందిన బొడ్డు వెంకటమ్మ అనే వృద్ధురాలి మెడలో నుండి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు అపహరించిన ఘటన అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు కావడం వల్ల నేరస్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శనివారం కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు.

నెల్లికుదురు మండలం తారా సింగ్ బావికి చెందిన హేమంత్, మహబూబాబాద్ పట్టణానికి చెందిన వినోద్ కుమార్ ఇద్దరూ స్కై బ్లూ కలర్ స్కూటీపై వచ్చి వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకొని పారిపోయారన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు రావడంతో వెంటనే  ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగుల ఆచూకీ కోసం గాలించామన్నారు. శనివారం 12 గంటల ప్రాంతంలో ఇనుగుర్తి - కోరుకొండ పల్లి రహదారిలో సదరు నిందితులు పట్టుబడ్డారని చెప్పారు. వారి నుండి దొంగతనానికి గురైన సొత్తు, స్కూటీ, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకొని చోరీ సొత్తును ఒకరోజు వ్యవధిలోనే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ డి.ఎస్.పి తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, సిసిఎస్ సిఐ హత్తి రామ్, కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్, నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు, సిసిఎస్ ఎస్ఐ తాహెర్ బాబా, సిబ్బందిని అభినందించారు.