20-07-2025 05:22:30 PM
565 బైపాస్ రోడ్డు బాధితుల నిరసన..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జాతీయ రహదారి 565 పానగల్లు నుండి సాగర్ రోడ్డు వరకు 14 కిలోమీటర్ల బైపాస్ రోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రోడ్డు పనులు ప్రారంభించాలని 565 జాతీయ రహదారి భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షులు సయ్యద్ హాశం, కో కన్వీనర్లు దోనాల నాగార్జున రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలు కోరారు. శనివారం గిరకబాయి గూడెం హౌసింగ్ బోర్డు మధ్యలో జాతీయ రహదారి 565 కాంట్రాక్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర నిరసన తెలిపారు. క్యాంపు మేనేజర్ సత్యంతో పలు అంశాలు చర్చించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వాసితులకు మంచి నష్టపరిహారం ఇప్పిస్తూ అందర్నీ సంతృప్తికరంగా మార్కెట్ రేటు కు అదనంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కలెక్టర్ మంత్రి హామీ మేరకు సుమారు 14 కిలోమీటర్లు పరిధిలో 1250 మంది నిర్వాసితులు ఉన్నట్లు గుర్తించారని వారికి అందరికీ నష్టపరిహారం సంతృప్తికరంగా అందే వరకు రోడ్డు పనులు నిలిపివేయాలని కోరారు.
బహిరంగ మార్కెట్లో చాలా విలువ కలిగిన భూములు కోల్పోతున్నామని రోడ్డు నిర్మాణానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాకు తగిన నష్టపరిహారం అందించి పనులు ప్రారంభించాలని కోరారు. ప్రస్తుతం ఆ భూములలో పంటలు వేసుకోవడం జరిగిందని, భూమి నష్టం తో పాటు పంట నష్టం కూడా జరగకుండా బాధితులందరికీ పూర్తి నష్టపరిహారం అందించేలోపు పంటలు కూడా పూర్తయితాయని ఆ తర్వాత రోడ్డుపనులు ప్రారంభించాలని కోరారు. రైతులందరికీ నష్టపరిహారం అందిన తరువాత రైతుల అనుమతితోనే రోడ్లు నిర్మాణం ప్రారంభిస్తామని అంతవరకు ఏ ఒక్క రైతు భూమిలో కూడా రోడ్డు వేయమని కాంట్రాక్టర్ క్యాంపు మేనేజర్ సత్యం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 565 జాతీయ రహదారి భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవ సలహాదారులు దండెంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, కోశాధికారి కన్నయ్య, కమిటీ సభ్యులు బోజ్జ మహేష్, లింగారెడ్డి, ఊట్కూరి నారాయణరెడ్డి, యాదగిరిరెడ్డి, జగన్ నర్సిరెడ్డి కిరణ్ శ్రీనివాస్ రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.