24 May, 2026 | 7:40 PM

ఏనుమాములలో సిండికేటు

19-04-2024 12:55 AM

l తూతూమంత్రంగా జెండా పాట

l వ్యాపారులు చెప్పిందే ఫైనల్ ‘రేటు’

l అడుగడుగునా దగా పడుతున్న మిర్చి రైతులు

l పట్టించుకోని అధికారులు

ఏనుమాముల మర్కెట్‌లో వ్యాపారుల సిండి‘కేటు’ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నది. సుమారు 700 మంది వ్యాపారులంతా ఒక్కటై రైతు కష్టాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తూతు మంత్రంగా జెండా పాట నిర్వహించి, నాణ్యమైన పంటకు వంకలు చూపి ధర తగ్గించి ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వరంగల్, ఏప్రిల్ 1౮ (విజయక్రాంతి): గతేడాది మార్కెట్‌లో మిర్చికి మంచి ధర పలకడంతో రైతులు ఈఏడాది గతంలో కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటను పండించారు. దిగుబడి బాగానే వచ్చినప్పటికీ మార్కెట్ ధరలు అంతంతమాత్రంగా ఉండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ శివారులోని ఎనుమాముల మార్కెట్‌లోనూ ఇదే దుస్థితి నెలకొన్నది. మార్కెట్‌కు ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా మిర్చి తరలివస్తుంది.

తదుపరి రోజు ఉదయం 7: 30 నుంచి 8 గంటలలోపే జెండా పాట ముగుస్తుంది. మార్కెట్ అధికారుల సమక్షంలో వ్యాపారులు ఒక కూటును ఎంచుకుని ‘ధర’ నిర్ణయిస్తారు. ఆ తర్వాత నిర్ణయించిన ధర ప్రకారం క్రయ విక్రయాలు ప్రారంభమవుతాయి. నిబంధనల ప్రకారం వ్యాపారులు పంట నాణ్యతను బట్టి ధర నిర్ణయించాల్సి ఉండగా, ఒకటి రెండు కూటులు చూసి ధర నిర్ణయిస్తుండడం, ఆ తర్వా వంకలు చూపి ధర తగ్గిస్తుండడం గమనార్హం. ఉదాహరణకు తేజా మిర్చి ధర క్వింటా రూ.19 వేలకు జెండా పాట పూర్తయితే పలికితే, వ్యాపారులు ఏదో వంక చెప్తూ క్వింటా మిర్చికి రూ.12 వేలు చెల్లిస్తున్నారని ఆరోపిన్నారు.

దడవాయిల దోపిడీ...

మిర్చికి ధర నిర్ణయించిన తర్వాత ఖరీదుదారులు పంటను పరిశీలించే క్రమంలో బస్తాలు కోసి కొంత మిర్చీని బయటకు తీస్తారు. ఈ లోపు కాంటాకు కొంత సమయం పడుతుండటంతో దడవాయిలు బస్తాల్లోని మిర్చిని మాయం చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.  

విధి లేక విక్రయం..

విధి లేని పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన రేటుకు రైతులు విక్రయిస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చాక ధరలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల కొరత కారణంగా ఎక్కువ సొమ్ము వెచ్చించి మిర్చి తీయించామని, పంట ను విక్రయిస్తే వచ్చే సొమ్ము దానికి సరిపోవట్లేదని వాపోతున్నారు.

విధి లేక పంట అమ్ముతున్నం..

పోయిన సంవత్సరం మిర్చికి మంచి ధర ఉండడంతో నేను  మిర్చి సాగు చేసిన. గతేడాది మిర్చి ఒక క్వింటాకు రూ.21 వేల ధర పలికింది. ఇప్పుడు క్వింటా కేవలం రూ.10 వేలు మాత్రమే పలుకుతున్నది. పంట దిగుబడి మంచిగ రావాలని లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టిన. తీరా పంట చేతికొచ్చాక మార్కెట్‌లో ధరలు పడిపోయాయి. కోల్డ్‌స్టోరేజీలో  పంటలను దాచుకుందామన్నా, అవి ఖాళీగా లేవంటున్నారు. పెండ్లి సంజీవయ్య, రైతు, పోచారం

రైతులను దోచుకుంటున్నారు..

సేట్లు రైతులను దోచుకుంటున్నరు. నిరుటికి ఈ ఏడాది ధరలో చాలా తేడా ఉంది. నాడు తాలుకాయకు పెట్టిన ధర కూడా ఇప్పుడు మేలు కాయలకు పెడుతలేరు. బస్తాలు కోసినప్పుడు దడ్వాయిలు కిలోల కొద్దీ సరుకు తీసుకుంటున్నారు. ఇదేమిటంటే గొడవకు దిగుతున్నారు. రైతుల బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. 

ముండ్రాతి సదానందం, రైతు, పులుకురి