24 May, 2026 | 8:14 AM

తెలంగాణది శతాబ్దాల చరిత్ర

19-04-2024 01:38 AM

l నాటి అస్మక జనపదమే నేటి రాష్ట్రం 

l హెరిటేజ్ వీక్‌లో మంత్రి కొండా సురేఖ  

హైదరాబాద్, ఏప్రిల్ 18: క్రీస్తు పూర్వమే షోడశ (16) మహాజనపదాల్లో ఒకటిగా వెలుగొందిన అస్మక జనపదమే నేటి తెలంగాణ ప్రాంతం కావటం మనకు గర్వకారణమని అట వీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ ఏడాది ‘చారిత్రక  కట్టడా ల వైవిధ్యాన్ని ఆవిష్కరించండి, ఆస్వాదించండి’ అనే నినాదాన్ని యునెస్కో చేపట్టింది. తెలంగాణ  ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ వారసత్వ దినోత్సవం (ఏప్రిల్ 18) సంద ర్భంగా ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు, వారసత్వ ప్రదేశాల వైభవాన్ని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు.

తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక కట్టడం రామప్ప దేవాలయం. ఈ సందర్భంగా  రామప్పలోని శిల్ప కళారీతులను మంత్రి కొనియాడారు. తెలంగాణ శిల్పుల నేర్పును, కళానైపుణ్యాన్ని చాటి చెప్పే పాండవుల గుట్ట రాక్ పెయింటింగ్స్, జైన బౌద్ధ ఆరామాలు, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, పద్మాక్షి గుట్ట, భువనగిరి కోట, చార్మినార్,  గోల్కొండ కోట, మక్కా మసీదు, మెదక్ చర్చి తదితర కట్టడాలు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటుతాయని మంత్రి తెలిపారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, రాష్ట్ర పురావస్తు శాఖలు కలిసి భారతదేశ సంస్కృతి, చారిత్రక కట్టడాలు, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు ఏటా హెరిటేజ్ వీక్‌ను నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు.  ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్)ను దేశ చారిత్రక వారసత్వాన్ని కాపాడటానికి  నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్థాపించారని మంత్రి సురేఖ గుర్తు చేశారు.