calender_icon.png 20 July, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్‌లో ఉద్రిక్తత

20-07-2025 01:29:26 AM

క్రికెట్ సంఘం కిరికిరి

ఓవైపు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి విచారణ.. మరోవైపు సర్వసభ్య సమావేశం

  1. స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీస్ బందోబస్తు 
  2. మరోవైపు స్టేడియంలో సీఐడీ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ 
  3. ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ విచారణ 
  4. హెచ్‌సీఏ కొత్త అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ సురేశ్‌కుమార్, ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ కేసీ భాను ఏకగ్రీవం

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ఉప్పల్ స్టేడియం వద్ద శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకవైపు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి విచారణ, మరోవైపు హెచ్‌సీఏ వార్షిక సర్వ సభ్య సమావేశం నేపథ్యంలో గందరగోళంగా మారింది. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన అవినీతి, అక్రమాలు, సంతకాల ఫోర్జరీ వంటివి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంతో మరింత చర్చనీయాంశమైంది.

ఈ అంశంపై సీఐడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు సహా ఇతరులను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం ఉప్పల్ స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్‌లో భాగంగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సురేశ్‌కుమార్‌ను కొత్త అంబుడ్స్‌మన్‌గా, రిటైర్డ్ జస్టిస్ కేసీ భానును హెచ్‌సీఏ ఎథిక్స్ ఆఫీసర్స్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ సురేశ్‌కుమార్ పేరును బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శివలాల్ యాద వ్ ప్రతిపాదించగా, ఏపీ మాజీ క్రికెటర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు వీ చాముం డేశ్వరీనాథ్ బలపరిచారు. ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ కేసీ భాను పేరును హెచ్‌సీఏలో సీనియర్ సభ్యుడైన వినోద్ ఇంగ్లే ప్రతిపాదించగా, రవీందర్ సింగ్ బలపరిచారు.

అవినీతి ఆరోపణలు, విచారణల వంటి గందగోళ పరిస్థితుల మధ్య వీరి నియామకం పూర్తి అయింది. ఏ డాది పాటు అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ వా రి పదవుల్లో కొనసాగనున్నారు. అయితే పదవీ కాలాన్ని మూడేళ్లకు పెంచుకునే అవకాశం కూ డా ఉన్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. 

173 క్లబ్స్ సెక్రటరీలకే ఎంట్రీ..

ఉప్పల్ స్టేడియంలోని హెచ్‌సీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌కు కేవలం అనుమతి ఉన్న క్లబ్ సెక్రటరీలను మాత్రమే లోపలికి రానిచ్చారు. దీంతో స్టేడియం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనుమతి పొందిన 173 క్రికెట్ క్లబ్‌ల సెక్రటరీలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.

అయితే తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీసీజేఏసీ సభ్యులు హెచ్‌సీఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు.  

స్టేడియం వద్ద భారీ బందోబస్తు..

అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే హెచ్‌సీఏ సమావేశానికి అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్‌ల కార్యదర్శులను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంతో స్టేడియం వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముందే గ్రహించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు స్వయంగా ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితులను పర్యవేక్షించారు.

స్టేడియం దగ్గర నెలకొన్న ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి కూడా అరెస్టు అయిన వారిలో ఉన్నారు. దీంతోపాటు ఈ అక్రమాల కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ చేపట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

ఉప్పల్ స్టేడియంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్..

హెచ్‌సీఏ కేసును విచారిస్తున్న సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు ప్రా రంభించింది. విచారణ వేగవంతం చే యడంలో భాగంగా శనివారం కేసు లో అరెస్టు అయిన వారిని నేరుగా ఉప్పల్ స్టేడియానికి తీసుకొచ్చి రీకన్‌స్ట్రక్షన్ చేసింది. కేసులో ఏ1గా ఉన్న జగన్‌మోహన్‌రావును శుక్రవారం ఉప్పల్ స్టేడియంలోని ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి రికార్డుల ఆధా రంగా ప్రశ్నించింది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివ రకు స్టేడియంలో అన్ని కలిపి 500 మ్యాచ్‌లు నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన రికార్డులను బయటకుపెట్టి నిధుల వినియోగంపై ఆరా తీసిం ది. హెచ్‌సీఏ ఖర్చు చేసిన రికార్డులను పరిశీలించింది. రికార్డుల్లో ఉన్న లెక్కలపై జగన్‌మోహన్‌రావు నుంచి వివర ణ తీసుకుంది. దీనికి కొనసాగింపుగా శనివారం హెచ్‌సీఏ ట్రెజరర్‌గా వ్యవహరించిన శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్‌ను తీసుకొచ్చి దాదాపు గంటన్నరపాటు విచారించింది.