20-07-2025 07:26:43 PM
సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో దీర్ఘకాలంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పూర్తిగా విఫలమైందని సమస్యలు పరిష్కరించడం మరిచి కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ విమర్శించారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘం స్ట్రక్చర్ సమావేశంలో సొంత ఇంటి కల, మారుపేర్ల మార్పు, అలవెన్సులపై ఐటి మాఫీ, క్యాడర్ స్కీమ్ వంటి డిమాండ్ల సాధనకు కమిటీల ఏర్పాటుకు ఒప్పుకుని కార్మికులను తప్పుతోవ పట్టిస్తూ, మభ్యపెడుతున్నారని, వీటిపై కార్మికులే గుర్తింపు సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో ఏఐటియుసి విడుదల చేసిన మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చుకొని వాటిని అమలుచేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. బాటా బూట్లపంపిణీ, నాణ్యమైన రక్షణ పరికరాలు, కావాలంటూ అడగడమే తప్ప వాటిని పంపిణీ చేయడం మరిచి పోయారని ఆరోపించారు. మైన్స్, సేఫ్టీ కమిటీల సమయంలో గుర్తింపు సంఘం నాయకులు గనిలోకి దిగి పని ప్రదేశాలను పర్య వేక్షించాలని, స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యం తో చర్చించిన విషయాలను నోటీసు బోర్డు ద్వారా కార్మికులకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులను షిఫ్ట్ చేంజ్ చేసే విధానాల వలన పని ఒత్తిడికి గురై సరిగా డ్యూటీలు చేయడం లేదని కౌన్సిలింగ్ కు హాజరు కాని పరిస్థితి వస్తున్నందున యాజమాన్యం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి సమస్యలు తెలుసుకుని విధులకు హాజరయ్యే విధంగా, నాణ్య మైన బొగ్గు ఉత్పత్తికి దోహద పడేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు జె.వెంకటేష్, బ్రాంచ్ సీనియర్ నాయకులు అలవాల సంజీవ్, నాగవెల్లి శ్రీధర్, ఏ రాజ్ కుమార్, లింగాల రమేష్, బద్రి ఆదర్శ్, చైతన్య రెడ్డి, మహమ్మద్ తాజ్ లు పాల్గొన్నారు.