19-07-2025 10:24:06 PM
భద్రాచలం (విజయక్రాంతి): పాత తరం గిరిజన సంస్కృతి వారి కట్టుబాట్లు నేటి బాలబాలికలు తెలుసుకొని ఆచరించే విధంగా మ్యూజియం రూపొందించడం చాలా సంతోషంగా ఉందని మ్యూజియం రూపకల్పన చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్(ITDA Project Officer Rahul)ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాల, పిఎం హెచ్ హాస్టల్ హెచ్ఎం సావిత్రి అన్నారు. శనివారం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు 425 మంది, 20 మంది ఉపాధ్యాయులు సందర్శించి మ్యూజియంలో పొందుపరిచిన గిరిజనుల అన్ని కళాఖండాలను క్లుప్తంగా తిలకించారు.
ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ... అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటితరం బాల బాలికలకు తెలిసే విధంగా కళాఖండాలు ఏర్పాటు చేయడం, వాటి యొక్క చరిత్ర ప్రదర్శించడం విద్యార్థినీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగతమైందని, మ్యూజియంలో మాత్రం గిరిజనులకు సంబంధించిన స్పష్టమైన సమాచారం విద్యార్థులకు తెలిసే విధంగా మ్యూజియం నిర్వహకులు ప్రతి అంశం తెలియజేయడం చాలా బాగుందని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు ఆటవీడుపుగా ఇటువంటి సందేశాలు ఉన్న గిరిజన కళాఖండాలు చూపెట్టడం వలన వారిలో మేధాశక్తి పెరిగి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల గురించి పూర్తిస్థాయిలో తెలుసు కుంటారని అలాగే పాతతరం గిరిజనులు వాడే పనిముట్లు, గిరిజన వంటకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, సరిత, పిడి వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు మ్యూజియం నిర్వహకులు మాధవి మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.