calender_icon.png 19 July, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువుల్లో దొబ్బ వాపు వ్యాధి.. సిబ్బంది లేక అందని పశు వైద్యం

19-07-2025 05:27:14 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ డివిజన్లో పశు వైద్యం అందక రైతులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం వర్షాకాల పరిస్థితుల వల్ల మేకలు, గొర్రెలలో దొబ్బ వాపు వ్యాధి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రైతులు తమ పశుసంపదను కాపాడుకునేందుకు పశువైద్యశాలకు పరుగులు పెడుతున్నారు. ఇక్కడి రైతులు పశుసంపదపై ఆధారపడి జీవిస్తుంటారు. కాగా గత కొద్ది రోజులుగా ఈ వ్యాధి పశువుల్లో తీవ్రస్థాయికి చేరింది. అక్కడక్కడ బర్రెలు, ఎద్దులు గొర్రెలు మేకలు కనులు ఉబ్బి, చీము కారటం, వల్ల చనిపోయిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. చేసేది లేక రైతులు తమ మేకలను గొర్రెలను తీసుకొని ఖానాపూర్ పశు వైద్య ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు ఉండక నిరాశ ఎదురవుతుందని, గతి లేక పశువులను మరణానికి అప్పగించాల్సి వస్తుందని స్థానిక శ్రీ రాంనగర్ కాలనీకి చెందిన రైతు గాడ్పు చందు తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలో ఒక్కడే వైద్యుడు ఉండడంతో అంతట వైద్యం అందించలేకపోతున్నాడు కనీసం మందులు కూడా లేకపోవడం పశు వైద్యం పై నిర్లక్ష్యం కొట్టి వచ్చి నట్లు కనిపిస్తుంది. సంచార పశు వైద్యశాల కు సమాచారం ఇచ్చినా కూడా ఫలితం లేదని వారి నుంచి స్పందన కరువైందని రైతు చందు ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలను ఆశ్రయించి తమ పశువులను కాపాడుకోవాల్సి వస్తుందని వారు వేదన చెందారు. ఇకనైనా పశు వైద్య ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిని కేటాయించాలని కోరారు ఈ నేపథ్యంలో విజయక్రాంతి స్థానిక పశువైద్యాధికారి రామచంద్రుడు ను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని తాను ఒక్కడిని మాత్రమే స్థానికంగా వైద్యం చేయాల్సి వస్తుందని చాలినంత మందులు కూడా లేవని అన్నారు.