19-07-2025 03:10:28 PM
కరీంనగర్,(విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నా1మని రాష్ట్ర బి సి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్ లో నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు,మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు చెక్కులు ,స్టీల్ బ్యాంక్ , కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... 10 సంవత్సరాల నుండి మీరు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
పెళ్లి అయి పిల్లలు పుట్టిన ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా రాలేదు కానీ ప్రజా పాలన ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మండలంలో 1301 రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. రేషన్ కార్డులు రాని వారు అప్లయ్ చేసుకోవాలని పార్టీలకు అతీతంగా పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఎక్కడమే కాదు ఆర్టీసీ బస్సులకు మహిళా సంఘాలకు ఓనర్లు అయ్యారని, మొన్ననే ఆర్టీసీ బస్సుల కిరయాలు మహిళా సంఘాలకు చెక్కులు అందించామన్నారు.
ఈ మండలంలో 35 సంఘాలు ఉన్నాయి.. ఇప్పుడు ఆరు మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ఇస్తున్నాం.. అందులో 16 రకాల వస్తువులు ఉన్నాయని, దానిని ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేలా మీరు కృషి చేయాలన్నారు. మీ గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా స్టీల్ బ్యాంక్ వస్తువులు వాడాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ ఇతర వ్యాధులు వస్తున్నాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ జరుగుతుందని, మీ పంట పొలాలకు త్వరలోనే సాగు నీరు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.