గొర్రెల పంపిణీ ఎప్పుడో..?
l రెండో విడత కోసం ఎదురుచూపులు
l కట్టిన డీడీల డబ్బులైనా ఇవ్వాలని గొల్ల, కురుమల వేడుకోలు
కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : రెండో విడతల గొర్రెల పంపిణీ కోసం గొల్ల, కురుమలు ఎదురుచూస్తున్నారు. డీడీలు కట్టి నెలలు గడుస్తున్నా ఇంకా పంపిణీ చేపట్టకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్ల్రునా ఇవ్వండి.. లేకపోతే డబ్బులైనా ఇవ్వాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 833 మంది గొల్ల, కురుమలు రెండో విడతలో రూ.45 వేల చొప్పున డీడీలు కట్టి ఉన్నారు. రెండో విడతలో కొందరికి గొర్రెలు పంపిణీ చేసిన అధికారులు, మిగిలిన వారికి త్వరలోనే ఇస్తామని ప్రకటించారు.
ఇప్పటికే నెలలు గడుస్తున్నా అధికారులు రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే మారినా తమకు మాత్రం గొర్రెలు రాలేదని చెబుతున్నారు. గొల్ల, కురుమల ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్ (20 గొర్రెలు, 1 పొట్టేలు) ఇవ్వాలని నిర్ణయించారు. 25 శాతం వాటాధనం లబ్ధిదారుల నుంచి డీడీ రూపంలో కట్టించుకున్నారు. మొదటి విడతలో జిల్లాలో 10 వేలకు పైగా యూనిట్లను పంపిణీ చేసిన అధికారులు.. రెండో విడతలో మాత్రం ఆలస్యం చేస్తున్నారని గొల్ల, కురుమలు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ డీడీలు కట్టామని వారు చెబుతున్నారు.
అక్రమాలపై విచారణకు ఆదేశం..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో అక్రమాలు, అవినీతి జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ పథకం అమలు అవుతుందా లేదా అనే సందిగ్ధత కూడా నెలకొంది. అయితే ఈ పథకంపై నూతన విధివిధానాలు రూపొందించి అమలులోకి తీసుకొస్తారని పలువురు భావిస్తున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
జిల్లాలో 582 మందికి రెండో విడతలో గొర్రెల యూనిట్లు మంజూ రయ్యాయి. కొంత మందికి పంపిణీ చేశాం. మిగిలిన వారికి ఇవ్వాల్సి ఉంది. యూనిట్లు రానివారి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వారు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వడం గానీ, గొర్రెలు పంపిణీ చేయడం గానీ చేస్తాం.
సింహారావు, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి, కామారెడ్డి
డీడీలు కట్టి
ఆరు నెలలు అవుతుంది..
ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తుందని చెప్పడంతో రూ.45 వేలు అప్పుగా తెచ్చి డీడీ కట్టాను. నెలలు గడుస్తున్నా గొర్రెలు ఇవ్వడం లేదు. అధికారులను అడిగితే వస్తాయి అంటున్నారు తప్ప గొర్రెలను మాత్రం ఇవ్వడం లేదు. తెచ్చిన అప్పుకు వడ్డీ పెరుగుతుంది.
శ్యామయ్య,
బస్వన్నపల్లి, కామారెడ్డి జిల్లా
ఈ ప్రభుత్వమైనా ఆదుకోవాలి..
గొర్రెలు పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం చెబితే రూ.45 వేలు డీడీ కట్టాను. యూనిట్ మంజూరైందని అధికారులు చెప్పారు. గొర్రెలు వస్తాయని సంతోషించా. అప్పటికే ఎన్నికలు రావడంతో ఆపేశారని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా గొర్రెలను పంపిణీ చేసి ఆదుకోవాలి.
సాయిలు, బస్వన్నపల్లి, కామారెడ్డి జిల్లా






