20-07-2025 12:46:07 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కంటే ముందు వ్యవహారం సాఫీగా సాగినా.. తెలంగాణ బీజేపీలో ఆ ఎన్నిక కాస్త పూర్తయ్యాక పరిస్థితి ఒక్కసారిగా వేడిక్కిపోయింది. అధ్యక్ష ఎన్నికను విభేదిస్తూ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీని వీడిపోగా.. తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీ నేతలు ఎవరి పేరు తీసుకుని విమర్శలు చేయకపోయినా..
కడుపులో కత్తులు పెట్టుకుని తనపై కుట్రలు చేస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలను హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానంటూ పరోక్షంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిది కురచ బుద్ధంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దాదాపుగా అగ్గిరాజేశాయని పొలిటికల్ టాక్ నడుస్తోంది. బీసీ కోటాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఊహించి..
తనకే వస్తుందని చివరి వరకు ఆశ పెట్టుకున్నా అది దక్కకపోవడానికి పార్టీలోని రెండు ప్రధాన గ్రూపులు గట్టిగా తనపై దుష్ప్రచారం చేయడం వల్లేనని ఈటల భావిస్తున్నట్లు ఆయన వర్గం వారు చెబుతున్నారు.
అందుకే తనకు పార్టీలో పట్టు లేకుండా చేయాలని చూస్తు న్న వారిపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారని, అయితే తెలివిగా ఎవరి పేరు తీసుకో కుండా, అందరికీ తాను ఎవరిని నిందిస్తున్నారో తెలిసేలా విమర్శలు చేశారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈటల ఇక్కడితో ఆగిపోతారా లేక ఆయన కూడా రాజాసింగ్ బాట పడతారా అనేది ఆసక్తికరంగా మారింది.
పెద్ది విజయభాస్కర్