ట్రిలియన్ సవాల్!
బలమైన ఆర్థిక తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల మార్క్
- లక్ష్యం ఐదు రెట్లు.. ప్రస్తుత వృద్ధి వేగం సగమే
- ఏటా 17.5% వృద్ధి తప్పనిసరి ప్రస్తుతం జీఎస్‌డీపీ వృద్ధి 10.7 శాతమే
- ఐదు నెలల్లో రూ. 14,840 కోట్ల రెవెన్యూ లోటు.. రూ. 34వేల కోట్లకు పైగా అప్పులు
- రూ.34,285 కోట్లకు చేరిన ద్రవ్యలోటు
- పెట్టుబడులను ఆదాయంగా మార్చడమే కీలకం
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణను(Telangana) దేశంలోనే బల మైన ఆర్థిక వ్యవస్థగా(Economy) తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రస్తుత ఆర్థిక గణాంకాలు పరీక్షగా మారాయి. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి 5 నెలల ఆర్థిక లెక్కలు షాక్ ఇస్తున్నాయి. 2026 బడ్జెట్‌లో ఏడాదికి రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు వస్తుందని ఆంచనా వేయ గా.. అందుకు భిన్నంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఏకంగా రూ. 14,840.81 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది.
భారీ ఆర్థిక లక్షాల దిశగా ప్రభు త్వం పరుగులు తీస్తున్న వేళ.. ఆదాయం, వ్యయాల వాస్తవ లెక్కలు సవాల్‌గా మా రాయి. ‘తెలంగాణరైజింగ్ భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభు త్వం భారీ లక్ష్యాలను నిర్దేశించింది. హైదరాబాద్‌ను గ్లోబల్ గ్రోత్ ఇంజిన్‌గా మార్చడం, కొత్త పారిశ్రామిక కారిడార్లు, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, కొత్త పట్టణ ప్రాంతాల అభివృద్ధి, హైస్పీ డ్ రైలు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. కానీ, ఈ లక్ష్యాలన్నీ సాకారం కావాలంటే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఎంతో అవసరం.
అప్పులపై ఆధారపడుతున్న రాష్ట్రం..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ద్రవ్యలోటు కూడా కీలక అంశమని నిపుణులు చెబుతున్నారు. 2026 రూ.58,458.71 కోట్ల ద్రవ్యలోటు అంచనా వేయగా, తొలి ఐదు నెలల్లోనే అది రూ.34,285.22 కోట్లకు చేరింది. అంటే పూర్తి సంవత్సరానికి అంచనా వేసిన ద్రవ్యలోటులో గణనీ యమైన భాగం ఆర్థిక సంవత్సరం మొద టిదశలోనే నమోదైంది. ఇదేసమయంలో ప్రభుత్వం తొలి ఐదు నెలల్లో రూ.34 వేల కోట్లకు పైగా అప్పులు సమీకరించింది. పూర్తి సంవత్సరానికి 58 వేల కోట్లకుపైగా రుణ సమీకరణ అంచనా ఉండగా, ఇప్పటికే పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవాల్సి వచ్చింది.
అయితే అభివృద్ధి ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టి, భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలను పెంచే విధంగా రుణాలను వినియోగిస్తే దాని ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమలకు భూమి, విద్యుత్, నీరు, రహదారులు, లాజిస్టిక్స్, విమానాశ్రయాలు, పట్టణ రవాణా, డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో నిరంతర పెట్టుబడులు వంటి అంశాలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో 2026 బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.47,267.28 కోట్లు కేటాయించారు.
కానీ తొలి ఐదు నెలల్లో ఖర్చు చేసింది రూ.12,412.53 కోట్లు మాత్రమే. ఇది మొత్తం కేటాయింపులో 26.26 శాతంగా ఉంది. భారీ ప్రాజెక్టులు కాగితంపై ఉండటం, వాటికి బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ఒక దశ మాత్రమే. భూసేకరణ, అనుమతులు, టెండర్లు, కాంట్రాక్టులు, పనుల పురోగతి, చెల్లింపులు వంటి దశలను వేగంగా పూర్తి చేసి ఆ పెట్టుబడిని భౌతిక ఆస్తులుగా మార్చినప్పుడే అది ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.
17.5 శాతం వృద్ధి రేటు అవసరం..
తెలంగాణ రైజింగ్ రోడ్‌మ్యాప్‌లో ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం సుమారు 200 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. 2034 నాటికి దాన్ని 1 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలంటే కేవలం పది సంవత్సరాల్లో ఐదు రెట్లు పెంచాల్సి ఉంటుంది. ఇది సాధారణ వృద్ధి లక్ష్యం కాదు. 200 నుంచి 1,000 బిలియన్ డాలర్లకు వెళ్లాలంటే సుమారు 17.5 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు అవసరం. 2025 తెలంగాణ నామినల్ జీఎస్డీపీ వృద్ధి సుమారు 10.7 శాతంగా నమోదైంది.
దీన్ని 17.5 శాతం అవసరమైన వార్షిక వృద్ధితో పోల్చితే చాలా అంతరం కనిపిస్తుంది. అంటే ట్రిలియన్ డాలర్ లక్ష్యానికి గానూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగాన్ని నిర్మాణాత్మకంగా పెంచాల్సి ఉంటుంది. అందుకు తయారీ రంగం విస్తరణ, సేవల రంగంలో కొత్త అవకాశాలు, ఎగుమతుల పెంపు, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఏఐ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్ వంటి రంగాలను మరింత వేగంగా విస్తరించాల్సి ఉంటుంది.
తెలంగాణకు ఇప్పటికే హైదరాబాద్ రూపంలో బలమైన సేవల రంగం ఉంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు వంటి రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. అయితే ట్రిలియన్ డాలర్ లక్ష్యానికి మరింత విస్తృతమైన ఆర్థిక పునాది అవసరం. అందుకే కేవలం ‘ఎన్ని పెట్టుబడులు వచ్చాయి?’ అనే అంశం మాత్రమే కాకుండా ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి?, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి?, ఎగుమతులు ఎంత పెరిగాయి?, రాష్ట్ర ఆదాయానికి ఎంత తోడ్పడింది?, స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపింది? వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హామీల అమలుకు భారీగా ఖర్చు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుండగా, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్‌ను రూ.4,000కు పెంచడం, అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం వంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉంది. వీటి అమలుకు అవసరమైన వార్షిక వ్యయం ఎంత? దానికి శాశ్వత ఆదాయ వనరులు ఏమిటి? ఇప్పటికే ఉన్న సంక్షేమ వ్యయాలతో కలిపి మొత్తం భారం ఎంత అవుతుంది? అనే అంశాలు కీలకం కానున్నాయి. తెలంగాణ ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, జీసీసీలు, రియల్ ఎస్టేట్, స్టార్టప్లు వంటి రంగాల కారణంగా నగరం రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక ఇంజిన్‌గా ఉంది.అయితే ట్రిలియన్ డాలర్ లక్ష్యానికి హైదరాబాద్ వృద్ధితో రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమలు, సేవల రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు అభివృద్ధి చెందడం కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
రైజింగ్ ప్రాజెక్టులపై భారీ అంచనాలు..
ట్రిలియన్ డాలర్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల్లో భారత్ ఫ్యూచర్ సిటీ కీలకమైనది. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలు, కొత్త పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా మూసీ పునరుజ్జీవన కార్యక్రమం హైదరాబాద్ పట్టణ ఆర్థిక వ్యవస్థను మార్చే ప్రాజెక్టుగా ప్రభుత్వం పేర్కొంటోంది. క్యూర్, ప్యూర్, రేర్ వంటి ప్రాంతీయ అభివృద్ధి వ్యూహాల ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
హైదరాబాద్ హైదరాబాద్‌ేొచెన్నై మధ్య హైస్పీడ్ రైలు ప్రతిపాదనలు కూడా రాష్ట్రాన్ని ఇతర ప్రధాన ఆర్థిక కేంద్రాలతో మరింత వేగంగా అనుసంధానించాలన్న వ్యూహంలో భాగంగా ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్టులలో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో మాత్రమే కాకుండా కేంద్ర అనుమతులు, నిధులు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యావరణ అనుమతులు, భూసేకరణ వంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, నిధులు, అనుమతులపై విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే సీఎం విజ్ఞప్తుల చేసినప్పటికీ ఎన్ని ప్రతిపాదనలకు సూత్రప్రాయ ఆమోదం లభించింది?, ఎన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయి?, ఎన్ని ప్రాజెక్టులు భూసేకరణ దశ దాటాయి?, ఎన్ని పనులు గ్రౌండ్‌లో ప్రారంభమయ్యాయి?, ఎన్ని ప్రాజెక్టులు ఉత్పత్తి, ఉద్యోగాలు సృష్టించే దశకు చేరాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సిన అవసరం ఉంది.