హయత్‌నగర్ లేబర్ అడ్డా తరలిస్తాం
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 4 : హయత్ నగర్(Hayathnagar) లోని జాతీయ రహదారి పక్కన ఉన్న లేబర్ అడ్డాను రేడియో స్టేషన్(Radio station) వద్దకు తరలిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(LB Nagar MLA Sudheer Reddy) అన్నారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని లేబర్ అడ్డా వద్ద ఆదివారం అసంఘటిత కార్మికులు, స్థానికులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. లేబర్ అడ్డా పరిధిలో ఉన్న కాలనీవాసులు లేబర్ అడ్డాను తరలించాలని పలుమార్లు ఎమ్మెల్యేను కోరారు. ఇందులో భాగంగా ఆదివారం అయన హయత్ నగర్ కు వచ్చారు.
ఈ సందర్భంగా చుట్టుపక్కల కాలనీవాసులు మాట్లాడుతూ.. లేబర్ అడ్డా కారణంగా ప్రతిరోజూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రోడ్లపైనే మూత్రవిసర్జన చేయడం, పేకాట ఆడటం, రోడ్డు పక్కనే నిద్రించడం వంటి కారణాలతో ముఖ్యంగా మహిళలు, స్థానిక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ లేబర్ అడ్డాను మరో ప్రాంతానికి తరలించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై సుధీర్ రెడ్డి స్పందిస్తూ.. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే జీవనోపాధి పొందుతున్న కార్మికులకు కూడా ఇబ్బంది కలగకుండా సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు.
రేడియో స్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్ ప్రాంతంలో కార్మికుల కోసం మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి కార్మికులు కూడా అంగీకారం తెలిపారు. అదేవిధంగా స్థానిక ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి.. లేబర్ అడ్డా వద్ద కార్మికులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, నాయకులు గుత్త లక్ష్మారెడ్డి, దీపావళి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.