తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

04-10-2026 | 12:18pm

ఉట్నూర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తాగునీటి సమస్య (Drinking Water Problem) పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన మహిళలు ఆదివారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో (Empty Pots) రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ముత్నూర్ గ్రామంలోని హనుమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చారు. తమ ప్రాంతంలో కొంతకాలంగా తాగునీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

పంచాయతీ వార్డు సభ్యురాలు యమునాబాయి ఆధ్వర్యంలో మహిళలు సుమారు 40 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఖాళీ బిందెలను రోడ్డుపై ఉంచి తాగునీరు (Drinking Water Supply) అందించాలని డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తమ సమస్యను అధికారులు పట్టించుకోవాలని కోరారు. మహిళల ఆందోళన విషయం తెలుసుకున్న సర్పంచ్ రీటా విట్టల్ అక్కడికి చేరుకున్నారు. మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆమె తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. సర్పంచ్ హామీతో మహిళలు రాస్తారోకో విరమించి ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం (Permanent Solution) చూపించాలని స్థానిక మహిళలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు