శిరీష కుటుంబానికి అండగా నిలవాలి
కోటి పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ములకలపల్లి,(విజయక్రాంతి): శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి కోటి రూపాయల నష్టపరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ములకలపల్లి మండలం చౌటిగూడెంలో శిరీష కుటుంబాన్ని శుక్రవారం కూనంనేని పరామర్శించి, ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.
శిరీష పనిచేసిన ఆస్పత్రిలో సరైన భద్రతా వసతులు లేకపోవడంపై చర్యలు తీసుకోవాలని డీజీపీతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ తరఫున శిరీష దశదిన కర్మలకు మూడు క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, మేయర్ మూడ గణేష్, నరాటి ప్రసాద్, యండి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.






