4 September, 2026 | 10:49 PM

Breaking News

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి   •   ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •  

శ్రీహరికోట నుంచి నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17

04-09-2026 | 03:24pm

తిరుపతి: శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్(Rocket) ద్వారా ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని సబ్-జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌(Orbit)లోకి ప్రవేశపెట్టే ప్రక్రియ చేపట్టింది.సుమారు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రో చేపట్టిన ఈ మిషన్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం కావడం విశేషం. దాదాపు 2,268 కిలోల బరువున్న ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 మోసుకెళ్లింది.

ఈ రాకెట్ అంచనాలకు భిన్నంగా ఉండటంతో ఇస్రో దీనికి ముద్దుగా ‘నాటీ బాయ్’ అనే పేరు పెట్టింది. ప్రయోగానికి ముందు నుంచే ఈ రాకెట్ ప్రత్యేకతపై ఆసక్తి నెలకొంది. విపత్తులపై ముందస్తు హెచ్చరికలకు ఉపయోగం. ఈవోఎస్-05 ఉపగ్రహం ప్రకృతి విపత్తుల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించనుంది. తుఫానులు, వరదలు, భూకంపాలు వంటి విపత్తులను వేగంగా గుర్తించడంతో పాటు, వాటిపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందించనుంది. 

అంతేకాకుండా వ్యవసాయ రంగానికి కూడా ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పంటల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, భూ వినియోగంలో చోటుచేసుకుంటున్న మార్పులను గుర్తించడం వంటి కార్యకలాపాలకు ఉపగ్రహం నుంచి అందే డేటా దోహదపడనుంది.

దేశ భౌగోళిక సరిహద్దులకు సంబంధించిన సమాచారాన్ని దాదాపు రియల్‌టైమ్‌(Real time)లో సేకరించడం ఈ మిషన్‌లో ప్రధాన ఉద్దేశంగా ఉంది. దీంతో దేశ భద్రత, రక్షణ రంగానికి ఈవోఎస్-05 కీలక ఉపగ్రహంగా మారనుంది. సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకునే మార్పులను వేగంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రకృతి విపత్తుల నిర్వహణ నుంచి వ్యవసాయం, భూ పర్యవేక్షణ, జాతీయ భద్రత వరకు పలు రంగాలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించేలా ఈ మిషన్‌ను రూపొందించారు. ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష సామర్థ్యాల్లో మరో కీలక ముందడుగు పడినట్టైంది.