చిన్నారులకు బిస్కెట్‌ తినిపిస్తున్నారా? జాగ్రత్త!

04-10-2026 | 11:25am

చిన్నారులకు బిస్కెట్లు (Biscuits) ఇస్తున్నారా..? అయితే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ విషాద ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. బిస్కెట్ గొంతులో ఇరుక్కొని ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందిన ఘటన  హైదరాబాద్ లోని మూసాపేట్ మండల పరిధిలోని సుర్తి తండాలో చోటుచేసుకుంది. మూడవత్ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి ముందు ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా.. తల్లి మౌనిక వంట చేసేందుకు వెళ్లే ముందు వారికి బిస్కెట్లు ఇచ్చారు.

బిస్కెట్ తింటున్న సమయంలో ఒక్కసారిగా అది ఏడాది వయసున్న చిన్నారి గొంతులో (Throat) ఇరుక్కున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చిన్నారి శ్వాస తీసుకోవడంలో (Breathing Problem) ఇబ్బంది పడి కుప్పకూలిపోయాడు. చిన్నారి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి (SVS Hospital) తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఏడాది వయసులోనే చిన్నారి మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనతో సుర్తి తండాలో విషాదఛాయలు (Tragedy) అలుముకున్నాయి. చిన్నారులకు ఆహారం ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం, వయసుకు తగిన ఆహారాన్ని మాత్రమే అందించడం ఎంతో ముఖ్యమని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది

మరిన్ని వార్తలు