ల్యాబ్ ఉన్నా.. బయట పరీక్షలేనా?
- ప్రభుత్వ దవాఖానాలో ప్రైవేటు రక్తపరీక్షలపై రోగుల ఆగ్రహం
- సర్కారు ల్యాబ్ ఉండగా బయట సిబ్బందితో పరీక్షలంటూ ఆరోపణలు
- వైద్యాధికారులు విచారణ చేపట్టాలని ప్రజల డిమాండ్
వాంకిడి, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో (Government hospital) ప్రైవేటు ల్యాబ్ సేవలు అందుతున్నాయంటూ రోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన కొందరు రోగులకు ఆసుపత్రిలోని ల్యాబ్‌లో రక్తపరీక్షలు చేయకుండా.. బయట నుంచి ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్‌ను పిలిపించి ఆసుపత్రి ఆవరణలోనే రక్తపరీక్షలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆసుపత్రుల్లో రక్తపరీక్షలు, ఇతర రోగనిర్ధారణ పరీక్షలకు ల్యాబ్ సదుపాయాలు కల్పించింది.
అయితే ఆసుపత్రిలోనే ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ బయట నుంచి ప్రైవేటు సిబ్బందిని పిలిపించి పరీక్షలు నిర్వహించడంపై రోగులు, వారి బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ల్యాబ్ సేవలను ఎందుకు వినియోగించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయా? ఆసుపత్రి ఆవరణలో ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు ఎవరి అనుమతి ఉంది? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.ఈ వ్యవహారంపై జిల్లా వైద్యాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో ల్యాబ్ సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుని, రోగులకు ప్రభుత్వ వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలని కోరుతున్నారు.