దానం ఇష్యూపై స్పీకర్ నో కామెంట్.. ఎందుకు..?

19-09-2026 | 04:14pm

హైదరాబాద్: దానం నాగేందర్(Danam Nagender) అనర్హత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైకోర్టు తీర్పు అనంతరం ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించేందుకు నిరాకరించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హాజరైన స్పీకర్‌ను మీడియా ప్రతినిధులు దానం అనర్హత పిటిషన్లు, హైకోర్టు తీర్పుపై ప్రశ్నించారు. అయితే దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయన మౌనంగా వెళ్లిపోయారు.

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఉప ఎన్నికలకు సిద్ధం: దానం

మరోవైపు హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

దానం వ్యాఖ్యలతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికలపై చర్చ మళ్లీ ఊపందుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.






మరిన్ని వార్తలు