పెళ్లి చేసుకోవద్దని నేనెప్పుడూ చెప్పలేదు!

19-10-2026 | 05:25am

నరేశ్ విజయకృష్ణ, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’(Crazy Kalyanam) ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తమ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ బాగుందని పేర్కొంటూ టీమ్.. మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “క్రేజీ కల్యాణం’ లాంటి మంచి సినిమా రావాలంటే గట్స్, ప్యాషన్ ఉన్న టీమ్ కావాలి. ‘పరదా’ కంటెంట్‌పై నమ్మకం ఉందని చెప్పా.

ఇప్పుడు ఓటీటీలో ఆ మూవీ ట్రెండ్ అవుతోంది. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ప్రశంసిస్తారనేందుకు ఆ సినిమా ఉదాహరణ. నేను కంటెంట్ ఓరియెంటెడ్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. దాంతో ప్రేక్షకులకు వినోదంతోపాటు ఒక చిన్న మెసేజ్ కూడా ఇవ్వగలుగుతున్నా. కొత్తగా ఏదో చెప్పాలని అనుకుంటా. ‘క్రేజీ కల్యాణం’ లాంటి కాస్ట్ అండ్ క్రూను, ఇలాంటి మంచి కథలను సపోర్ట్ చేయడాన్ని ఇష్టపడతా.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేను పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలను సగం మాత్రమే కట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవద్దని నేనెప్పుడూ చెప్పలేదు. పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు కావాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చని, కానీ పిల్లల కోసమే పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సరైన పద్ధతి కాదని మాత్రమే నేను చెప్పాను. పిల్లల్ని కంటే వారికి సంతోషకరమైన జీవితాన్ని అందించడం ముఖ్యమనేది నా ఉద్దేశం” అని చెప్పింది.

‘నిజాయితీగా ఒక మంచి కథ రాసి తీస్తే తప్పకుండా విజయం లభిస్తుందని మా సినిమాతో మరోసారి నిరూపితమైంది” అని డైరెక్టర్ భద్రప్ప తెలిపారు. నిర్మాత బూసం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. “బయట నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అని టెన్షన్ పడ్డాం. మా సినిమాకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌” అన్నారు. గీత రచయిత గోరటి వెంకన్న మాట్లాడుతూ..

“ఎలాంటి అశ్లీలత, హింస, అసభ్యత లేకుండా చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించడం నిర్మాతగా జగన్‌మోహన్‌రెడ్డి ప్యాషన్‌ను చాటుతోంది. ఈ అవకాశాన్ని అంతే జాగ్రత్తగా ఉపయోగించారు దర్శకుడు భద్రప్ప. ఒక పర్పస్‌ఫుల్ మూవీగా వచ్చిన క్రేజీ కల్యాణం సినిమాను ప్రేక్షకులే మరింత ముందుకు తీసుకెళ్లాలి” అని చెప్పారు. నటీనటులు నరేశ్ విజయ కృష్ణ , గౌరీశంకర్, లక్ష్మి కిరణ్, నీల ప్రియ, డీవోపీ శ్యామ్ దూపాటి, ఆర్ట్ డైరెక్టర్ సాయి కదిర, రైటర్ శ్రీనివాస రవీంద్ర, చిత్రబృందం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు