గంభీరావుపేటలో ఎక్సైజ్ దాడులు.. గోవా మద్యం పట్టివేత
గంభీరావుపేట, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజయేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్యేక తనిఖీల్లో (Special Drive) భాగంగా సోమవారం మండలంలోని లక్ష్మీపూర్, గోరంటాల, లింగన్నపేట, సముద్ర లింగాపూర్, గజసింగవరం గ్రామాల్లో దాడులు నిర్వహించారు. గోరంటాల గ్రామానికి చెందిన కుమ్మరవేరి నాగరాజు వద్ద అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 750 ఎంఎల్ సామర్థ్యం గల 15 గోవా నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం (NDPL) సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ మొహిస్, కానిస్టేబుళ్లు సిద్ధిరాములు, కరుణాకర్, కృషిధర్, వర్ష తదితరులు పాల్గొన్నారు.