యథేచ్ఛగా ‘కల్తీ కల్లు’ దందా..
- మత్తులో పెరుగుతున్న నేరాలు, హత్యలు
- పోటాపోటీగా విక్రయాలు..
- ప్రభుత్వ భూమిలో అక్రమ దుకాణాలు
- ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం
- కాళ్ల గజ్జల కోసం మహిళలపై పాశవిక దాడులు
చేవెళ్ల, అక్టోబర్ 18 (విజయక్రాంతి): చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామ(Dharmasagar village) పరిధిలో కల్లు విక్రయాలు పూర్తిగా గాడితప్పాయి. ఇద్దరు వ్యాపారులు పోటాపోటీగా సాగిస్తున్న ఈ దందాతో పాటు, కల్లులో విచ్చలవిడిగా మత్తు పదార్థాల కల్తీ(Adulteration of narcotic substances) జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నా, అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజలు మండిపడుతున్నారు.
నిబంధనలకు తూట్లు
మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడెంకు చెందిన అశోక్ గౌడ్, మరో వ్యాపారి విజయ్ గొల్లపల్లి ధర్మసాగర్ పరిసర గ్రామాల్లో కల్లు వ్యాపారాన్ని విస్తరించారు. అశోక్ గౌడ్ పత్తేపూర్ నుంచి కల్లు తెచ్చి విక్రయిస్తుండగా, విజయ్ గొల్లపల్లి గ్రామంలోనే కల్లును తయారు చేస్తూ అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ధర్మసాగర్ పరిధిలో ఉన్న మొత్తం 5 కల్లు దుకాణాల లైసెన్సులను (విజయ్ 3, అశోక్ గౌడ్ 2) కొనుగోలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు లీజులకు ఇచ్చి రెండేళ్లుగా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు : మామూళ్ల మత్తులో అధికారులు...
ధర్మసాగర్ వద్ద విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి మరీ కల్లు దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఏ దుకాణంలో కల్లు మత్తు ఎక్కువగా ఉంటుందనే ప్రచారం ఆధారంగా వ్యసనపరులు అక్కడికి ఎగబడుతున్నారు. చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఈ తంతు జరుగుతున్నా, అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మత్తులో వరుస దాడులు, హత్యలు
ధర్మసాగర్ కల్లు కేంద్రాల్లో విక్రయించే మత్తు ఏ స్థాయిలో ఉంటోందనడానికి అక్కడ జరిగిన ఘోరాలే నిదర్శనం.కాళ్ల గజ్జల కోసం భయానక దాడి..ధర్మసాగర్ కల్లు తాగి నిద్రమత్తులోకి వెళ్లిన ఒక ఒంటరి మహిళను ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలోకి తీసుకెళ్లి, కాళ్ల గజ్జల కోసం ఏకంగా చీలమండల వరకు నరికిన అమానుష ఘటన ఈ మత్తు తీవ్రతను తేటతెల్లం చేస్తోంది.కడియాల కోసం హౌస్కీపింగ్ మహిళపై దాడి..
ఓ ప్రభుత్వ కార్యాలయంలో హౌస్ కీపింగ్గా పనిచేస్తున్న సమీప గ్రామానికి చెందిన మహిళ, జులై 21న ధర్మసాగర్ వద్ద ఓ వ్యక్తితో కలిసి కల్లు తాగింది. ఆమె స్పృహ కోల్పోయాక కాళ్ల కడియాలు కాజేయాలని చూసిన నిందితుడు, అవి రాకపోవడంతో రాళ్లతో కాళ్లపై తీవ్రంగా మోదాడు. తీవ్రగాయాలతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.
ఆస్తి కోసం కల్లు తాగించి హత్య
సొంత కుటుంబ సభ్యులే భూ వివాపాల నేపథ్యంలో ఒక రైతుకు బలవంతంగా ఈ మత్తు కల్లు తాగించి, ఆపై గొంతు కోసి చంపేసిన దారుణ ఘటనలు కూడా ఇక్కడ చోటుచేసుకున్నాయి.
స్పందించాలని ప్రజల డిమాండ్..
ఇంతటి ఘోరాలు జరుగుతున్నా ఎక్సైజ్, పోలీసులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో భయాందోళనతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణమే అధికారులు స్పందించి కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపాలని, ప్రభుత్వ భూముల్లోని దుకాణాలను తొలగించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.