మళ్లీ కడుపుబ్బా నవ్వించనున్న కటారియా ఫ్యామిలీ!
ఇల్లు అంటే మన చుట్టూ ఉన్న నాలుగు గోడలేనా? లేక ఆ ఇంట్లో మనతో కలిసి జీవించే మనుషులు, వారితో ముడిపడిన జ్ఞాపకాలే నిజమైన ఇల్లా? అనే ఆలోచనలతో సతమయ్యేవారు కటారియా ఫ్యామిలీలోకి తొంగిచూడాల్సిందే అంటున్నారు మేకర్స్. అర్థం కాలేదా? ప్రేక్షకాదరణ పొందిన ‘బకైతి’ వెబ్‌సిరీస్ సీజన్ 2(Bakaiti web series season 2) సిద్ధమైంది. తాజాగా ఇందుకు సంబంధించి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
మధ్యతరగతి కుటుంబ జీవితం, వారి రోజువారీ సమస్యలు, సరదా సంఘటనలను సహజంగా చూపించిన తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈసారి మరింత నవ్వులు, గొడవలు, ఆప్యాయతతోపాటు ప్రతి ఒక్కరికీ తమ ఇంటి పరిస్థితులను గుర్తు చేసే ఎన్నో సందర్భాలతో సీజన్ 2 అలరించనుంది.
పాత ఘజియాబాద్ పరిచయమైన వీధుల నేపథ్యంలో సాగే ఈ సీజన్‌లో కటారియా కుటుంబ సభ్యులంతా మరోసారి ఒక్కచోట చేరతారు. కొత్త సవాళ్లు, మారుతున్న కుటుంబ సంబంధాలు, ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, సరదా సంఘటనల మధ్య కుటుంబంగా కలిసి ఉండటంలోని అందమైన గందరగోళాన్ని వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ సీజన్‌లో ఆసక్తికరంగా చూపించనున్నారు.
డైస్ మీడియా నిర్మాణంలో సమర్ ఇక్బాల్ దర్శకత్వం వహించిన ‘బకైతి’ సీజన్ 2లో రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా, తన్యా శర్మ, ఆదిత్య శుక్లా కటారియా కుటుంబంలోని ప్రధాన పాత్రల్లో మరోసారి సందడి చేయనున్నారు. వీరితోపాటు దేవిషి మదన్, రిత్విక్ నంబియార్, అశోక్ చవాన్ కూడా నటిస్తున్నారు.